ఎమ్బీయస్‌ : కొరియా శశికళ

దక్షిణ కొరియా అధ్యక్షురాలైన 64 ఏళ్ల పార్క్‌ గ్యూయెన్‌హై కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలు గత వారంలో ఉధృతమయ్యాయి. ఆమె పదవీకాలం 2018 ఫిబ్రవరి వరకు వున్నా ఆమె అర్జంటుగా గద్దె దిగిపోవాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, స్కూలు పిల్లలు, కార్మిక యూనియన్‌ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. ఇటీవలి కొన్ని దశాబ్దాలలో యింత పెద్ద ప్రభుత్వవ్యతిరేక ప్రదర్శన జరగలేదట. ఇంతకీ ఆమె సొంతంగా చేసిన అక్రమమేమిటో వాళ్లు చెప్పటం లేదు. 60 ఏళ్ల చోయీ సూన్‌సిల్‌ అనే ఆమె సహచరిపై కోపమంతా ఆమెపై చూపుతున్నారు. జయలలిత విషయంలో శశికళ ఎలాటిదో యీ చోయీ కూడా అలాటిదే. అధ్యక్షురాలికి సన్నిహితంగా వుంటూ దేశరహస్యాలు సేకరిస్తూ, అవినీతికి పాల్పడుతోందని ప్రజల నమ్మకం. అంతటి ప్రజాగ్రహం వున్నపుడు పార్క్‌ ఆమెను వదుల్చుకోవచ్చు కదా అనిపిస్తుంది కానీ పట్టుకుని వేళ్లాడడం ఆమెకు తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వం.

పార్క్‌ తండ్రి చుంగ్‌హీ సైనిక నియంత. 1963లో గద్దె కెక్కి దక్షిణ కొరియా ఆధునికతను సంతరించుకునేట్లు చేశాడు. ఆ క్రమంలో మానవహక్కులను హరించాడు. అది కొంతమందికి కష్టం కలిగించింది. అతని భార్యను 1974లో ఉత్తర కొరియాపై పక్షపాతం కలిగిన వ్యక్తి హత్య చేశాడు. అప్పణ్నుంచి కూతురు పార్క్‌ను ఫస్ట్‌ లేడీగా వ్యవహరించేవారు. ఐదేళ్ల తర్వాత 1979లో చుంగ్‌హీ కూడా హత్యకు గురయ్యాడు. హత్య చేసినది వేరెవరో కాదు అతని గూఢచారి సంస్థ అధినేతే! దానికి కారణం చుంగ్‌హీ తన ఆధ్యాత్మిక గురువు చోయీ తేమిన్‌ చేతిలో కీలుబొమ్మ కావడమే. అతను బౌద్ధమతస్తుడు, పోలీసు అధికారి. అయితే రోమన్‌ కాథలిక్‌ క్రైస్తవం తీసుకుని చర్చ్‌ ఆఫ్‌ ఎటర్నల్‌ లైఫ్‌ అనే మతపంథాని ప్రారంభించాడు. చుంగ్‌హీ తనను ఆదరించడంతో అతన్ని అడ్డుపెట్టుకుని అధికారం చలాయించసాగాడు, డబ్బులు సంపాదించసాగాడు. కొరియా ప్రజలు అతన్ని రస్‌పుతిన్‌తో పోల్చసాగారు.

గ్రిగరీ రస్‌పుతిన్‌ (1869-1916) రష్యాలో ఒక పల్లెటూరి నాటు వైద్యుడు, జోస్యుడు. ఆనాటి రష్యా పాలకుడైన జార్‌ కొడుక్కి వచ్చిన అరుదైన వ్యాధిని నయం చేసి జార్‌ భార్యకు, తద్వారా జార్‌కు సన్నిహితుడయ్యాడు. అప్పటికే జార్‌ అధికారం క్షీణించి, తిరుగుబాటులు తలెత్తుతున్నాయి. మానసికంగా గందరగోళపడుతూ రస్‌పుతిన్‌ చెప్పే జోస్యాలు నమ్మసాగాడు. చక్రవర్తి దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించి రస్‌పుతిన్‌ జమీందార్లను, జాతీయవాదులను ఒక ఆట ఆడించాడు. వ్యక్తిగతంగా విలాసాలతో, భోగాలతో జీవించసాగాడు. జార్‌ను రక్షించుకోవాలంటే రస్‌పుతిన్‌ను తుదముట్టించక తప్పదనే ఉద్దేశంతో జార్‌ అనుయాయులు అతన్ని చంపివేశారు. కొరియా విషయానికి వస్తే జోస్యుణ్ని కాకుండా జోస్యాలు వినే పాలకుణ్నే చంపివేశారు. ఆ విధంగా తేమిన్‌ పీడ విరగడైందనుకున్నారు. కానీ వాళ్లకు తెలియదు - అప్పటికే తేమిన్‌ అధ్యక్షుడి కూతురు పార్క్‌ను బుట్టలో పెట్టేశాడని! తన 22 వ ఏట తల్లిని పోగొట్టుకుని అయోమయంలో వున్న పార్క్‌తో అతను 'మీ అమ్మ నాకు కలలోకి వచ్చి నిన్ను చేరదీయమంది' అని చెప్పి ఆమెను శిష్యురాలిగా చేసుకున్నాడు. తన కంటె 40 ఏళ్లు చిన్నదైన పార్క్‌ను లైంగికంగా కూడా లోబరచుకుని అనధికారికంగా ఆమెకు ఒక బిడ్డను కూడా ప్రసాదించాడంటారు. అధికారికంగా మాత్రం పార్క్‌ అవివాహిత. 1994లో తన 82 ఏట చనిపోయే లోపున తేమిన్‌ ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పార్క్‌ చేత ప్రభుత్వానికి అనుకూలమైన 'మూవ్‌మెంట్‌ ఫర్‌ ఏ న్యూ మైండ్‌' అనే పేర సామాజిక సంస్థ పెట్టించి, నిర్వాహకురాలిగా తన కూతురు సూన్‌సిల్‌ను పార్క్‌కు తగిలించాడు. అప్పటి నుంచి ఆమె జోస్యాలు చెపుతూ పార్క్‌ను అంటకాగుతోంది. ఆమె చెప్పినట్లా పార్క్‌ ఆడుతోంది. ఏ రోజు ఏ రంగు, ఏ డిజైను బట్టలు వేసుకోమంటే అవే వేసుకుంటుంది.

తండ్రి మరణానంతరం పార్క్‌ రాజకీయంగా పోరాడుతూ, ఎదుగుతూ వచ్చింది. తండ్రి పార్టీ అధ్యక్షురాలిగా, ఎంపీగా కొంతకాలం పనిచేసి, చివరకు 2013లో అధ్యక్షురాలిగా ఎన్నికైంది. సూన్‌సిల్‌కు అధికారికంగా ఏ పదవీ లేకపోయినా పార్క్‌ను అంటిపెట్టుకుని వుంటూ వ్యవహారాలు చక్కబెడుతూ వుంది. ప్రభుత్వ రహస్యపత్రాలన్నీ ఆమె చేతుల మీదుగానే నడుస్తున్నాయి. పార్క్‌ సిబ్బంది అంతా ఆమె ముందు సాష్టాంగపడుతున్నారు. ఆమె భర్త (దరిమిలా విడిపోయింది) పార్క్‌ వద్ద చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పనిచేశాడు. ఇద్దరూ కలిసి పార్క్‌ పేర బాగానే సంపాదించారు. కొరియాకు చెందిన పెద్ద ఫ్యామిలీ గ్రూపు 'కొరియన్‌ చెబోల్స్‌' నుండి 774 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల లంచాలు తీసుకుని మీర్‌, కె-స్పోర్ట్‌ అనే రెండు మీడియా, స్పోర్ట్‌స్‌లకు సంబంధించిన ఫౌండేషన్లు ఏర్పాటు చేసింది. సూన్‌సిల్‌కు జర్మనీ అశ్వకళ (డ్రెస్సేజ్‌ అంటారు) నేర్చుకునే కూతురుంది. ఆ ఖర్చంతా లంచాల ద్వారా సంపాదించినదేట. ఆ పిల్ల యూనివర్శిటీలో చేరడానికై ఎడ్మిషన్‌ ప్రాసెస్‌లో గోల్‌మాల్‌ చేసిందట. పార్క్‌తో పనిబడిన వాళ్లందరూ సూన్‌సిల్‌ నెలకొల్పిన ఫౌండేషన్లకు విరాళాలు యివ్వవలసి వస్తోంది. సూన్‌సిల్‌పై ఆరోపణలు పెరిగినకొద్దీ పార్క్‌కు యిబ్బంది కలిగింది. సూన్‌సిల్‌ చెప్పుడు మాటలు విని ఉత్తర కొరియాతో చేతులు కలపాలని చూసిందని, కొరియా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిందని ప్రజలు నిరసన ప్రదర్శనలు చేయసాగారు. పార్క్‌ ఉపన్యాసాలన్నీ సూన్‌సిల్‌యే ఎడిట్‌ చేసిందని ఆరోపణలు చేశారు. అదేమీ కాదని బుకాయించినా ఉపన్యాసాలున్న కంప్యూటరు దొరకడంతో చివరకు అక్టోబరు 25న 'సూన్‌సిల్‌కు, నాకు వున్న సాన్నిహిత్యం వుంది. నా ముఖ్యమైన ఉపన్యాసాలను ఎడిట్‌ చేసే పని ఆమెకు అప్పగించాను. దేశానికి సంబంధించిన రహస్యపత్రాలు ఆమెకు చూపాను. దానికి క్షమాపణ చెపుతున్నాను' అని పార్క్‌ బహిరంగంగా  ప్రకటించింది.  Readmore!

అయినా జనం చల్లబడలేదు. ఆమె రాజీనామా చేయాల్సిందే అన్నారు. దాంతో తన ఆంతరంగిక సిబ్బందిలో చాలామంది ఉద్యోగాలు తీసేసింది. చివరకు తన ప్రధాని హ్వాంగ్‌ క్యోఆహ్న్‌ కూడా తీసేసింది. ఆ తీసేయడం కూడా స్వయంగా పిలిచి చెప్పకుండా టెక్స్‌ట్‌ మెసేజీ ద్వారా తొలగించడంతో వివాదగ్రస్తమైంది. ఈ ఆరోపణలు బయటకు వచ్చేసమయానికి సూన్‌సిల్‌ జర్మనీలో వుంది. తను అమాయకురాలినని చెప్పుకుంది. కొరియాకు తిరిగి వచ్చింది. మరణశిక్ష వేయదగినంత పెద్ద తప్పు చేశాను అని ఒప్పుకుంది. పోలీసులు ఆమెను అరెస్టు చేయడమే కాక ఆమె ట్రస్టులకు నగదు రూపంలో విరాళాలిచ్చిన పెద్ద సంస్థల కూపీ లాగసాగారు. శామ్‌సంగ్‌ కంపెనీ ఎడ్వర్టయిజింగ్‌ చూసే చెయిల్‌ వరల్డ్‌వైడ్‌ అని వాళ్లకు సంబంధించిన యూనిట్‌ కూడా యిలా లంచాలిచ్చిందన్న అనుమానంతో వారికి ప్రపంచవ్యాప్తంగా వున్న బ్రాంచిలపై మంగళవారం దాడులు చేశారు. సూన్‌సిల్‌ వివాదం కారణంగా పార్క్‌ తలపెట్టిన ఆర్థిక సంస్కరణలు ముందుకు సాగకపోవచ్చు.  

(ఫోటో - అధ్యక్షురాలు పార్క్‌ గ్యూయెన్‌హై, చోయీ సూన్‌సిల్‌)

  - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2016)

mbsprasad@gmail.com

Show comments