'ఉయ్యాలవాడ'.. చిరంజీవి ఊగిసలాడ.!

ఇప్పటి వ్యవహారం కాదిది.. చాలాకాలం క్రిందటే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పేరుతో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. ప్రముఖ సినీ రచయితల ద్వయం పరుచూరి బ్రదర్స్‌ ఈ కథపై చాలా కసరత్తులు చేశారు. సొంతంగా ఈ సినిమాకి తామే దర్శకత్వం వహించాలన్నది వారి ఆలోచన. చిరంజీవిని దృష్టిలోపెట్టుకునే సినిమా కథని దాదాపుగా ఓ కొలిక్కి తెచ్చేశారు కూడా. చిరంజీవి సైతం అప్పట్లో ఈ కథ పట్ల ఆసక్తి ప్రదర్శించారు. 

రాజకీయాల్లోకి వెళ్ళడం, సినిమాలకు దూరమవడంతో చిరంజీవి మీద ఆశ వదిలేసుకున్న పరుచూరి బ్రదర్స్‌, మధ్యలో ఈ కథని బాలకృష్ణకీ విన్పించారనే ప్రచారం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు పరుచూరి బ్రదర్స్‌, 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథ మీద ఫోకస్‌ పెట్టారట. చిరంజీవికి తాజాగా మరోమారు ఈ సినిమా కథ విన్పించారట. 'ఖైదీ నెంబర్‌ 150' ఫేం వినాయక్‌ని వెంటేసుకుని పరుచూరి బ్రదర్స్‌, చిరంజీవి వద్ద ఈ కథను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

ఈసారి చిరంజీవి కూడా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథ మీద ఆసక్తి చూపుతున్నారని సమాచారం. దానికి కారణం, ఇటీవల బాలకృష్ణ 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా చేయడమే కావొచ్చునేమో. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తొలి తరం పోరాటయోధుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఒకరిగా చెప్తారు. బ్రిటిష్‌ అరాచకాల్ని ఎదిరించి, పోరుబాట పట్టినందుకుగాను ఉయ్యాలవాడని అప్పట్లో బహిరంగంగా ఉరితీశారని చరిత్ర చెబుతోంది.

కథాంశం పరంగా అయితే, మాంఛి పవర్‌ఫుల్‌గా వున్నా, సినిమాగా ఇది తెరకెక్కితే ఎలా వుంటుంది.? ఏమోగానీ, రీ-ఎంట్రీలో చిరంజీవి నుంచి కమర్షియల్‌ సినిమాలు మాత్రమే కాకుండా, ఇంకా ఏదో కొత్తగా ఆశిస్తున్నారు ఆయన అభిమానులు. మరి, వారి కోరికను మన్నించి, చిరంజీవి ఈసారి రిస్క్‌ చేస్తారా.? వేచి చూడాల్సిందే.

Show comments