రక్షణ మంత్రీ.. ఇవేం మాటలు..?!

రక్షణ శాఖ మంత్రి పారికర్ కు ఆర్ఎస్ఎస్ అంటే.. ఎంత అభిమానం అయినా ఉండొచ్చు గాక, ఈయన నిజాయితీ పరుడనే పేరున్న వ్యక్తీ కావొచ్చు, దేశభక్తుడు, సమర్థుడే అయ్యుండొచ్చు.. కానీ, ఈ తరహా మాటలు మాత్రం సబబు కాదేమో!

సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో పారికర్ చేసిన వ్యాఖ్యలు నిస్సందేహంగా అర్థం లేనివి. ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో ఈ దాడులు చేసినట్టుగా పారికర్ చెప్పుకొచ్చాడు! పీవోకే లో ఈ దాడులు జరపాలని నిర్ణయించడానికి ఆర్ఎస్ఎస్ బోధనలే ప్రేరణ అని.. పారికర్ అన్నాడు. 

ఈ దాడులకు ఆర్ఎస్ఎస్ ప్రేరణ అని చెప్పుకోవడానికి పారికర్ చెప్పిన థియరీని వింటే తల తిరిగిపోతుంది. “గాంధీ మహాత్ముడు పుట్టిన గుజరాత్ నుంచి వచ్చిన నరేంద్రమోడీ, అసలు పోరాటం అంటే ఏమిటో ఎరగని గోవా నుంచి వచ్చిన నేను.. ఇలాంటి మా ఇద్దరి ఆధ్వర్యంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని అంటే దానికి కారణం.. ఆర్ఎస్ఎస్ బోధనలే..’’ అని పారికర్ చెప్పుకొచ్చాడు. అంటే.. మోడీని గాంధేయవాదిగా, తనను అంత కన్నా శాంతీయుతమైన వ్యక్తిగా పారికర్ చెప్పాడు. తమ తమ రాష్ట్రాల నేపథ్యాన్ని కూడా చాలా ఘనంగా చెప్పుకున్నాడు! తమను ఈ దాడులకు ఆర్ఎస్ఎస్ ప్రేరేపించిందని చెప్పుకొచ్చాడు. మరీ ఇన్ని రకాల అతిశయోక్తులు అయితే భరించడం కష్టం. 

గాంధీ పుట్టిన గుజరాత్ లోనే గోద్రా సంఘటన జరిగింది.. పారికర్ పుట్టిన గోవా లో ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందే.. తాము అలాంటి నేపథ్యాల నుంచి కూడా వచ్చామని పారికర్ కు ఎందుకు గుర్తుకు రావడం లేదో! ఈ మాటలతో పారికర్ ఆర్ఎస్ఎస్ ఇమేజ్ ను పెంచడం.. ఏమో కానీ, తన మీద ఉన్న గౌరవాన్ని అయితే కొంత వరకూ తగ్గించుకున్నాడని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. సైన్యాన్ని రాజకీయాల కోసం వాడుకోవడమే గాక.. తమ మాతృ సంస్థ ఇమేజ్ కోసం కూడా ఉపయోగించుకునే యత్నం చేస్తున్నాడు ఈ రక్షణ మంత్రి.

అలాగే ఇప్పుడు ఈ సర్జికల్ దాడులకు కారణం ఆర్ఎస్ఎస్ బోధనలే అని ఈయన గారు చెప్పకపోయి ఉన్నా.. సదరు సంస్థకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ.. అసంబద్ధమైన మాటలు మాట్లాడి తమ పరువును తామే తీసుకుంటున్నట్టుగా ఉన్నాయి వీరి మాటలు.

Show comments