బిఎ రాజు..ఇచ్చట అన్ని పనులు చేయబడును

ఇండస్ట్రీలో కొన్ని పేర్లు అంతే..అలా పాపులర్ అయిపోతాయి. దిల్ రాజు, గౌతం రాజు, ఎమ్ ఎస్ రాజు ఇలా. ఆ లైన్లో లో వుండదగ్గ పేరే బిఎ రాజు. కేవలం పీఆర్వోనే బిఎ రాజు అనుకుంటే పొరపాటే. ఆ ఏముంది, జర్నలిస్ట్, సూపర్ హిట్ మ్యాగ్ జైన్ ఎడిటర్ కూడా అనుకుంటే మళ్లీ తప్పులో కాలే. సర్లేండి..నిర్మాత కూడా, చంటిగాడు, లవ్ లీ, ఇప్పుడు వైశాఖం అన్నారనుకోండి..కాస్త బెటరే. కానీ ఇండస్ట్రీలో కనిపించని నాలుగో సింహం టైపు మనిషి బి ఎ రాజు. 

కొన్ని సినిమాలకు కథలుండవు. నెరేషన్ మాత్రం వుంటుంది. బిఎ రాజు వ్యవహారం కూడా అలాంటిదే. ఉదయం ఆరు గంటల నుంచి, రాత్రి పద కొండు గంటల వరకు బిజీ బిజీ. ఇందులో పీఆర్వో పనులు మహా అయితే పాతిక వంతే వుంటాయి. సూపర్ హిట్ పనుల మహా అయితే పదో వంతే వుంటాయి. తన సినిమా పనులు ఎప్పుడో కానీ వుండవు. మరి ఇంతకీ మిగిలిన టైమ్ అంతా ఏం చేస్తారంట? అలా అడిగితే..అసలు ఏం చేయరంట? అని ఎదురు ప్రశ్నించాలి.

నిర్మాతలకు ఏవో సలహాలు, సూచనలు, ప్రాజెక్టులు..పనులు. హీరోలకు ఆల్ ఇన్ ఆల్..అందుకే జస్ట్ ఓ పీఆర్వో అనుకునే బిఎ రాజుకు ట్విట్టర్ లో యాభై వేల మందికి చేరువగా ఫాలోవర్లు.

బిఎరాజు దగ్గర వున్న గొప్ప గుణం ఏమిటంటే, సినిమా ఇండస్ట్రీలోని వారిని ఎవరితో పావు గంట మాట్లాడితే, పాతిక గ్యాసిప్ లు కక్కుతారు. నిజానికి వాళ్లకు తెలిసినా, తెలియకపోయినా, అంతా తమకే తెలుసన్న టైపులో. అదే బిఎ రాజును రోజల్లా కెలికినా, ఒక్క వార్త కూడా బయటకు రాదు. కానీ ఆయన బుర్ర నిండా మొత్తం ఇండస్ట్రీ వ్యవహారాలే. కానీ ఒక్క ముక్క కక్కించగలిగితే..సవాల్. 

అందుకే బిఎ రాజు నమ్మకస్తుడు..నిర్మాతలకు, హీరోలకు, ఇంకా ఇండస్ట్రీలోని ఎందరికో. చెన్నయ్ లో కలం పట్టి, అక్కడే సూపర్ హిట్ పత్రిక పెట్టి, సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టి, హైదరాబాద్ లో పరిశ్రమతో పాటే తాను ఎదిగి, అలా అలుపెరగని ప్రయాణం సాగిస్తున్న బిఎ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు.

Show comments