ఏ పనయినా ఓ పద్దతి ప్రకారం జరగాలి. లేడికి లేచిందే పరుగు అంటే కుదరదు. రాజధాని నిర్మాణంపై చంద్రబాబు మనసులో ఏముందో ఆయనకు తప్ప వేరు మనిషికి తెలియదు. ఒకసారి సింగపూర్ అంటారు. మరోసారి జపాన్ అంటారు..ఇంకేదో అంటారు. పత్రికల నిండా గ్రాఫిక్స్ పరుచుకుంటాయి. వున్నట్లుండి పరిపాలన భవనాలు మాత్రమే కడతాం..అభివృద్ధి ప్రజల చేతుల్లో వుంది అంటారు.
ఇదిలా వుంటే ఆయనకు మనసులో పుట్టింది..ఒక్కసారిగా రాజధాని తరలింపు అనేసారు..రెండు భవనాలకు ఆఘమేఘాల మీద, అది కూడా ఫలానా తేదీలోపు కడితే ఇంత అదనంగా కూడా ఇస్తామని టెండర్లు పిలిచారు. తాత్కాలిక సచివాలయం అంటూనే వందల కోట్లకు టెండర్లు పిలిచారు.
అదే ఎక్కువ అనుకుంటే, మళ్లీ ఎమినిటీస్ అంటూ మరిన్ని కోట్లు. మెట్రో రైలు నిర్మాణానికి ఎక్కువగా వాడిని ఫ్రీ ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీని వాడడం ప్రారంభించారు. ఇంతా చేసి, బోనస్, అదనుపు చెల్లింపులు అందుకున్న కంపెనీకి కార్మికులు చాలకపోతే, విశాఖ నుంచి ప్రభుత్వమే సకల సదుపాయాలతో తరలించింది.
ఇన్ని చేసినా సచివాలయం రెడీ కావడం లేదు. అయినా బాబు తరలింపు ఆపడం లేదు. నానా హడావుడి చేస్తున్నారు. ఇప్పుడేమయింది సడెన్ గా..కడుతున్న భవనాలు కుంగుతున్నాయి. తీసుకున్నవి భూములు పల్లపు భూములు, పంటచేలు. వాటిపై పరీక్షలు చేసారో లేదో మరి. ఇప్పుడు ఏకంగా స్లాబులు పగుళ్లు ఇచ్చేస్తున్నాయట.
ఇప్పుడు తీరిగ్గా పరిక్షలు నిర్వహిస్తున్నారట. అసలే రాజధాని ప్రాంతం సరైనది కాదు. భూకంపాల జోన్ లో వుందని ముందే చెప్పారు.మరి ఇప్పుడు ఉట్టికుట్టినే కుంగిపోతే మరి ఏం చేయాలి?ఇప్పుడు ఉద్యోగులు ఏమంటారు. ఇలాంటి భవనాల్లో భయం భయంగా మేం పని చేయలేం అంటారు. పైగా ఇప్పుడు అదనపు నష్టం..కూడా. దీన్ని ఎవరు భరిస్తారు?
ప్రభుత్వమే.. చల్లగా భరించేస్తుంది. అవీ ఇవీ అన్నీ కలిపి సుమారు రెండు వేల కోట్ల రూపాయిలు జస్ట్ తాత్కాలిక సచివాలయం కోసం? ఇన్నాళ్లు సచివాలయం రెడీ..రెడీ అంటూ నిత్యం ఘోషించిన బాబు అనుకూల మీడియా ఈ పగుళ్ల వార్త ను ప్రచురించదేమి?