బాహుబలి 2 హక్కులు కనీవినీ ఎరుగని రేట్లకు విక్రయిస్తున్నారు. కొనే జనాలు అలాగే కొంటున్నారు. అయితే పార్ట్ 2 ను కొనేవాళ్లలో చాలా మంది కొత్త బయ్యర్లే. అంటే ఫీల్డ్ కు కొత్త కాదు. బాహుబలి తొలి భాగం కొన్నవాళ్లు కాదన్నది విషయం. ఇటు ఓవర్ సీస్ కావచ్చు, అటు తమిళనాడు, నైజాం కావచ్చు. దీనికి కారణం ఏమిటన్నదానిపై ఇండస్ట్రీలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్ట్ 2 కు భారీ రేట్లు చెప్పడంతో తొలి భాగం కొన్నవాళ్లు చాలా మంది వెనకడుకు వేసారని ఓ టాక్. అది చాలా సార్లు వినిపించిందే. అయితే కొత్తగా ఇంకో టాక్ వినిపిస్తోంది. బాహుబలి నిర్మాతలకు తమ సినిమా తొలిభాగాన్ని కొన్న బయ్యర్లు చాలా మందిపై కాస్త కోపం వుందన్నది ఆ టాక్. బాహుబలి తొలిభాగాన్ని సుమారు 40 కోట్ల డెఫిసిట్ లో విడుదల చేసారు. కానీ సినిమా భయంకరమైన బ్లాక్ బస్టర్ అయిపోయింది. కానీ ఆ మేరకు నిర్మాతలకు ఓవర్ ఫ్లోస్ రాలేదట.
ఇప్పటి వరకు ఇండస్ట్రీలో వున్న టాక్ ఏమిటంటే, అసలు ఓవర్ ఫ్లోస్ ఇవ్వలేదని. కానీ ఇన్ సైడ్ వర్గాల కథనం ఏమిటంటే, రెండో భాగాన్ని దృష్టిలో వుంచుకుని ప్రతి బయ్యరు ఇంతో అంతో ఓవర్ ఫ్లోస్ కట్టారట. ఓవర్ సీస్ తో సహా. కానీ బాహుబలి నిర్మాతలకు మాత్రం వారిపై కినుక పోలేదట. లెక్కలు సరిగ్గా చెప్పలేదని, ఏదో నామ్ కే వాస్తే ఓవర్ ఫ్లోస్ ఇచ్చారని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నైజాం హక్కుల విషయంలో బడా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును మాట మాత్రమైనా సంప్రదించకపోవడానికి ప్రధాన కారణం లెక్కలు సరిగ్గా చెప్పకపోవడమే అన్న గుసగుస వినిపిస్తోంది.
తొలిభాగం లాభాలు చేసుకుని, మలి భాగం మిస్ అయినవారు దురదృష్ట వంతులో, అదృష్టవంతులో సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.