తమిళనాడు రాజకీయ చదరంగంలో కేంద్ర ప్రభుత్వం చేతిలోని పావుగా ఉపయోగపడిన పన్నీరు సెల్వం.. విషయంలో నెక్ట్స్ ఏంటి? అనేది అత్యంత ఆసక్తికరమైన అంశం! చిన్నమ్మపై తిరుగుబాటు చేసి..నిలదొక్కుకోవడంతో ఫెయిల్యూర్ అయిన సెల్వం ఇప్పుడు కేవలం మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు! అంతే కాదు.. ఆయన మాజీ ఎమ్మెల్యే అయిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి!
పళనిస్వామి విశ్వాస పరీక్షలో నెగ్గడంతో పార్టీ పూర్తిగా శశికళ ఆధీనంలోకి వచ్చిందని స్పష్టం అవుతోంది. ఇక కొడుకు వరసయ్యే దినకరన్ ను అడ్డం పెట్టుకుని ఆమె చక్రం తిప్పే అవకాశం ఉంది. ఈమె త్వరలోనే తమిళనాడు జైలుకు తరలే అవకాశం కూడా ఉంది. అందుకు రెండు నెలల వరకూ సమయం పట్టొచ్చని నిబంధనలు చెబుతున్నాయి.
తదుపరి పరిణామాల్లో భాగంగా పన్నీరుపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే శశికళ వర్గం పన్నీరును ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక విశ్వాస పరీక్షలో తమ విప్ కు ఒదిగి ఉండలేదన్న నెపంతో పన్నీరు తో సహా ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలందరి మీదా అనర్హత వేటు వేయవచ్చు శశికళ వర్గం.
మరి అదే జరిగితే పన్నీరుకు ఎమ్మెల్యే హోదా కూడా పోతుంది. ఎలాగూ స్పీకర్ వీళ్ల వర్గంలోనే ఉన్నారు కాబట్టి… పన్నీరు అండ్ కో మీద అనర్హత వేయడం నిమిషాల మీద పని! అయితే అలా జరిగితే ఉప ఎన్నికలను ఎన్నికలను ఎదుర్కొనడానికి కూడా అన్నాడీఎంకే సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అలా కాకుండా.. పన్నీరు వైపు ఉన్న ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకుని.. పన్నీరును మాత్రం ఒంటరిని చేయవచ్చు.
ఇవన్నీ జరగడానికన్నా ముందే.. పన్నీరే పళని సామికి విధేయుడిగా మారినా మారొచ్చు! తను పొరపాటు చేశాను అని.. ప్రత్యర్థుల పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాను అని.. తనను క్షమించేయాలని.. ఆయన కోరవచ్చు. పరప్పన అగ్రహార జైలు వరకూ వెళ్లి శశికళ కాళ్ల మీద పడిపోయినా పడొచ్చు! పన్నీరు తీరును గమనించిన వాళ్లు ఇదే జరగొచ్చనే మాట చెబుతున్నారు!