'బాహుబలి' ఆ కసిని రగిల్చింది

తెలుగు సినిమా మహా అయితే వంద కోట్ల మార్కెట్‌. అంతకు మించిన ఆలోచన చెయ్యాలంటే మాత్రం చాలా చాలా భయం. వంద కోట్లు రాబట్టడానికి 70 నుంచి 80 కోట్ల దాకా ఖర్చు చేయక తప్పదనే వాదనలతో చాలామంది నిర్మాతల్ని నట్టేట ముంచేసిన సినిమాలు తెలుగులో చాలానే వచ్చాయి. తమిళ సినిమా కూడా ఇందుకు అతీతమేమీ కాదు. బాలీవుడ్‌ మాత్రం, వంద కోట్ల వసూళ్ళు దాటిన సినిమాల్ని చాలానే చూసేసింది. సరికొత్త రికార్డుల్ని కూడా చూస్తూనే వుంది. 

అయితే, 'బాహుబలి' రాకతో లెక్కలు మారిపోయాయి. 'బాహుబలి'కి ముందు ఓ లెక్క.. 'బాహుబలి' తర్వాత ఓ లెక్క. ఇప్పుడంతా వెయ్యి కోట్ల మార్కెట్‌ గురించే ఆలోచిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ సినీ పరిశ్రమల్లో ఇప్పుడంతా ఆ వెయ్యి కోట్ల మీదనే చర్చించుకుంటున్నారు. సాధారణ కమర్షియల్‌ సినిమాలతో 'పని' జరగదు గనుక, చారిత్రక నేపథ్యమున్న కథాంశాలపై ఫోకస్‌ పెట్టారిప్పుడు అంతా. 

రామాయణం, మహాభారతం, ఛత్రపతి శివాజీ, ఝాన్నీ లక్ష్మీబాయి.. ఇలాంటి అంశాల చుట్టూ ఇప్పుడు సినిమా కథలు ప్రిపేర్‌ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని పట్టాలెక్కుతున్నాయి కూడా. మరి, తమిళ సినీ పరిశ్రమ సంగతేంటి.? ఆ ప్రశ్నకి సమాధానం వెతకడంలో అందరికన్నా ముందున్నాడు చేరన్‌. తమిళ సినిమా కొత్త రికార్డుల్ని అందుకోవాలనీ, అందుకు తగ్గ కసరత్తులు ప్రారంభించాలని పిలుపునిచ్చి వార్తల్లోకెక్కాడాయన. 

మొత్తమ్మీద, 'బాహుబలి' సినీ జనాల్లో 'కసి'ని బాగానే రగిల్చిందన్నమాట. వెయ్యి కోట్ల వసూళ్ళు.. అన్న ఆలోచన వినడానికి బాగానే వుంటుంది. ఆ స్థాయి వసూళ్ళ కోసం వివిధ సినీ పరిశ్రమలు పోటీ పడితే అంతకన్నా కావాల్సిందేముంది.? ఆహ్వానించదగ్గ విషయమేంటంటే, ఏ బాషలో సినిమా తీసినా అది భారతీయ సినీ పరిశ్రమకు చెందిన చిత్రంగానే ప్రొజెక్ట్‌ చేయాలనే దిశగా ఆలోచనలు సాగుతుండడం.

Show comments