అమీర్‌ఖాన్‌కి ఇదేం తలనొప్పి.?

బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌ అంటే మిస్టర్‌ పెర్‌ఫెక్షనిస్ట్‌. ఏ సినిమా చేసినా, ప్రాణం పెట్టేస్తాడు. 'గజిని' రీమేక్‌ చేసినా, ఇంకో సినిమా చేసినా.. అందులో తనదైన ప్రత్యేకతని చాటతాడు. కానీ, తన తాజా చిత్రం 'దంగల్‌' విషయంలో అమీర్‌ఖాన్‌ కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు. 'దంగల్‌' ట్రైలర్‌ని చూసినవారంతా, దాన్ని 'సుల్తాన్‌'తో పోల్చుతున్నారు. కొందరేమో, 'సుల్తాన్‌'కి సీక్వెల్‌గా 'దంగల్‌'ని అభివర్ణిస్తున్నారు. దాంతో అమీర్‌ఖాన్‌కి చిర్రెత్తుకొచ్చేస్తోంది. 

'దంగల్‌' సినిమా విషయంలో తాను పడ్డ కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందనీ, సినిమా చూడకుండా దాన్ని ఇంకో సినిమాతో ఎలా పోల్చేస్తారని ప్రశ్నిస్తున్నాడు అమీర్‌ఖాన్‌. ట్రైలర్‌ చూస్తే, సినిమా కథేంటో అర్థమయిపోతుంది. పైగా, 'దంగల్‌' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. రెజ్లింగ్‌ వీరుడు మహావీర్‌సింగ్‌ ఫోగట్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న విషయం విదితమే. సో, సినిమా కథేంటి.? అన్న సస్పెన్స్‌ ఇక్కడ లేదు. 

సల్మాన్‌ఖాన్‌ హీరోగా రూపొందిన 'సుల్తాన్‌' ఆల్రెడీ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. చెప్పుకోదగ్గ విజయాన్నే అందుకుంది. మరి, అమీర్‌ఖాన్‌ తన 'దంగల్‌'తో ఎలాంటి కొత్తదనం చూపిస్తాడు.? అన్నదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ సినిమా విషయంలో అమీర్‌ఖాన్‌ అసహనం చూస్తోంటే, ఎక్కడో ఆయనలోనే కాస్త అనుమానం కన్పిస్తున్నట్లుంది. సినిమా సంగతేమోగానీ, 'దంగల్‌' - 'సుల్తాన్‌' చుట్టూ వ్యక్తమవుతున్న పోలికలు అమీర్‌ఖాన్‌కి తలనొప్పిగా తయారయ్యిందన్నది నిర్వివాదాంశం.

Show comments