బ్రహ్మాను అలా గాలికొదిలేశారు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిల్పా మోహన్ రెడ్డిని సర్వశక్తులూ ఒడ్డి గెలిపించుకోవడానికి ఇవాళ వైఎస్ జగన్మోహన రెడ్డి నంద్యాల ప్రచారబరిలో అడుగుపెడుతున్నారు. తను నిర్వహించిన బహిరంగ సభలోనే ప్రచారం ముగిసేవరకు ఇక్కడే ఉంటానన్న జగన్ ఈనెల 21దాకా నంద్యాల నుంచి వెళ్లకుండా.. ప్రచారాన్ని ముందుండి నడిపించే అవకాశం ఉంది. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి సంగతేంటి? ఆయనకు భరోసా ఇవ్వడానికి, అండదండగా నిలవడానికి తెలుగుదేశం అగ్రనాయకుల్లో ఎవరు దగ్గరుండి ఈ ఉప ఎన్నికలను పర్యవేక్షించబోతున్నారు?

ఈ ప్రశ్నకు ఆ పార్టీ వద్ద సమాధానం లేదు. చంద్రబాబునాయుడు.. నంద్యాలలో తాను నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమమే ప్రచార కార్యక్రమం కూడా అన్నట్లుగా చిన్న బిల్డప్ ఇచ్చి అక్కడితో చేతులు దులిపేసుకున్నారు. లోకేష్ పరిస్థితి కూడా అంతే..! నోటిఫికేషన్ కంటె చాలా కాలం ముందుగానే మంత్రిగా ఓ అధికారిక పర్యటనకు వచ్చిన లోకేష్.. ప్రచారం జోరందుకున్నాక ఇటువైపు కూడా రాలేదు. వారిద్దరూ వస్తారనే హామీ కూడా లేదు.

పార్టీ పురమాయిస్తున్నది గనుక.. తెదేపా మంత్రులు ఒక్కరొక్కరుగా వచ్చి రోజులు గడిపి తిరిగి వెళ్తున్నారు తప్ప... నంద్యాల ఉప ఎన్నిక భారాన్ని తమ భుజస్కంధాల మీద మోస్తాం.. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిని గెలిపిస్తాం అని ధైర్యం చెబుతున్న వాళ్లెవరూ కనిపించడం లేదు. అందుకే... ఇక్కడి పరిస్థితుల్ని లోతుగా గమనిస్తున్న వారు.. తెలుగుదేశం- భూమా బ్రహ్మానందరెడ్డిని గాలికొదిలేసినట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

‘‘మీ కుటుంబానికి టికెట్ ఇచ్చాం.. మీకు సత్తా ఉంటే నిరూపించుకోండి... గెలవండి. అంతే తప్ప.. గెలిపించే పూచీ మొత్తం తీసుకోవడం మా వల్ల కాదు’’ అని తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబం విషయంలో ఒక నిర్లిప్త ధోరణిని అవలంబిస్తున్నట్లుగా పలు విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. తెదేపా ఎన్నికల ప్రచారానికి కీలకంగా ముందంజలో ఉన్నది అఖిలప్రియ మాత్రమే. మరి ఆమె అనుభవ రాహిత్యం... ప్రజల్లో పెద్దగా గుర్తింపు ఉన్న నాయకురాలు కాకపోవడం.. వారి ప్రచారానికి ఒక మైనస్ అనే చెప్పాలి.

అలాగే పవన్ కల్యాణ్ ను ఎన్నికల ప్రచారానికి తీసుకురావచ్చుననుకున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదు. తెలుగుదేశం పెద్దలు మాత్రం వ్యూహాత్మకంగానే ప్రచారానికి దూరం ఉన్నట్లుగా సమాచారం. నేతల్లో ఎవరిని పలకరించినా.. ‘గెలిచేది మేమే’ అని జనాంతికంగా ఒక మాట చెబుతున్నారే తప్ప.. ప్రచారంలో అంత పట్టుదలతో పనిచేస్తున్న వాతావరణం కనిపించడం లేదని పలువురు భావిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారం ముగియడానికి ఇంకా పది రోజుల గడువు ఉండడంతో.. ఈలోగా పరిణామాలు ఎలాగైనా మారొచ్చునని కూడా అనుకుంటున్నారు.

Show comments