వెయ్యి కోసం కక్కుర్తి పడ్డారా.?

ప్రజాస్వామ్యం ఇలా తగలడింది.! అవును, నిజంగానే రాజకీయం, ప్రజాస్వామ్యంపై అత్యాచారానికి తెగబడ్తోంది. మొన్న తమిళనాడులో, నిన్న కర్నాటకలో, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో. వార్డు మెంబర్‌ ఎన్నిక కోసం ఓటుకి ఏడు వేల రూపాయలు ఖర్చు చేయడం ఎక్కడన్నా విన్నామా.? గుడివాడలో ఆ ఘనకార్యం జరిగింది. అధికార పార్టీ అభ్యర్థి తరఫున ఓటుకి ఏడు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరోపక్క, అధికార పార్టీకి పోటీగా ప్రతిపక్షం కూడా అక్కడ డబ్బులు పంచుతోంది.. అయితే కాస్త తక్కువగా, అదీ ఆరు వేల రూపాయలకు (కుంకుమ భరిణె అదనమట) ఓటు కొంటున్నారండోయ్‌. 

వెయ్యి రూపాయలకి కక్కుర్తి ఎందుకు.? అధికార పార్టీకన్నా ఇంకో వెయ్యి ఎక్కువ ఖర్చుపెడితే బాగుండేది కదా.. అన్న చర్చ దురదృష్టవశాత్తూ రాజకీయ వర్గాల్లోనే కాదు, మీడియా వర్గాల్లోనూ జరుగుతోందంటే, ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది.? అందుకే, ప్రజాస్వామ్యంపై రాజకీయం అత్యాచారానికి పాల్పడ్తోందని చెబుతోన్నది. చెన్నయ్‌లోని ఆర్‌కె నగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందర్భంగా ఓటుకి నాలుగు వేల రూపాయలదాకా చెల్లిస్తున్నారు. అది ఎమ్మెల్యే పదవి కోసం. కర్నాటకలోనూ దాదాపు ఇదే స్థాయిలో చెల్లిస్తూ, కెమెరాకి చిక్కేశారు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అండ్‌ కో. 

అక్కడా, ఇక్కడా అనేముంది.. దేశమంతా ఇలాగే తగలడింది. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల వేళ, అధికార పార్టీ విచ్చలవిడిగా ఖర్చు చేస్తే, ప్రతిపక్షం ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేక చతికిలపడిందంటూ మీడియాలో విశ్లేషణలు నిస్సిగ్గుగా తెరపైకొచ్చాయి. అది ప్రతిపక్షానికి పూర్తి మెజార్టీ వున్న స్థానాల్లో జరిగిన ఎన్నికలని సదరు మీడియా సంస్థలు గుర్తించకపోవడాన్ని ఏమనుకోవాలి.? 

ఎన్నికలంటేనే డబ్బుల పంపకం. రెడ్‌ హ్యాండెడ్‌గా నేతలు డబ్బులు పంచుతూ చిక్కినా, చిత్రంగా వారిపై పెద్దగా కేసులుండవు. ఎందుకిలా.? అందుకే మరి, దేశంలో ప్రజాస్వామ్యం ఇలా తగలడింది.

Show comments