కేసులు ఆమెకి కొత్త కాదు కదా.!

అక్రమాస్తుల కేసు ఇప్పటిది కాదు.. చాలాకాలం క్రితం నాటి కేసు ఇది. ఈ కేసులో శశికళ గతంలోనూ జైలుకి వెళ్ళి వచ్చారు. దోషిగా తేలి, ఆ తర్వాత క్లీన్‌ చిట్‌ పొందారు కూడా.! దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతోపాటే శశికళ ఈ అక్రమాస్తుల కేసును ఎదుర్కొంటున్న విషయం విదితమే. అసలు ఈ కేసులో శశికళ కారణంగానే జయలలిత ఇరుక్కుపోయారన్న వాదన వుంది. ఎలాగైతేనేం, ఇప్పుడు జయలలిత జీవించి లేరు.. దాంతో కేసు, శశికళ చుట్టూ తిరగనుంది. 

మామూలుగా అయితే, ఈ కేసు శశికళకు పెద్ద విషయమే కాదు. కానీ, ముఖ్యమంత్రి అయ్యేందుకు తనకున్న అవకాశాల్ని ఈ కేసు అడ్డుకుంటుండడమే శశికళ అసహనానికి కారణం. నిజమే మరి, ఇప్పటిదాకా ఇలాంటి కేసుల కారణంగా పదవులు పోయాయేమోగానీ, పదవులు దక్కకుండా పోలేదు. పదవులు పోవడానికీ, దక్కకుండా పోవడానికీ చాలా తేడా వుంది. జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు.. కేసు కారణంగా పదవి కోల్పోయారు.. క్లీన్‌ చిట్‌ తెచ్చుకుని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఒకసారి కాదు, రెండుసార్లు ఇలా జరిగిందామెకి. ఇప్పుడు శశికళకీ అలా అయి వుంటే అసలు సమస్యే వచ్చేది కాదేమో.! 

ముఖ్యమంత్రి పీఠమెక్కడానికి ఈ కేసుని అడ్డం పెట్టడంతో శశికళ అసహనంతో రగిలిపోతున్నారు. కానీ, ఏమీ చెయ్యలేని పరిస్థితి. పైగా, నమ్మిన బంటు అనుకున్న వ్యక్తి, అదేనండీ పన్నీర్‌ సెల్వం దెబ్బకొట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు శశికళ. జయలలితకు నమ్మిన బంటునిగానీ, శశికళకు కాదన్నది పన్నీర్‌ సెల్వం వాదన. 'కేసు ఎలా వున్నా, అప్పుడు పన్నీర్‌ సెల్వం చూసుకుంటాడులే' అన్న ధీమాతో వున్న శశికళ, ఆ పదవికే పన్నీర్‌ సెల్వం అడ్డు పడటంతో షాక్‌కి గురయ్యారు. షాక్‌ నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, కుదరడంలేదు. 

కాస్సేపట్లో న్యాయస్థానం నుంచి తీర్పు రానుంది. తీర్పు ఎలా వస్తుంది.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. కోర్టు తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే, ఆమె ముఖ్యమంత్రి అవడానికి దాదాపుగా అడ్డంకులు లేనట్లే. కానీ, ఆ కేసు తిరగబడదన్న గ్యారంటీ లేదు. అదే సమయంలో, ఎమ్మెల్యేలు జారిపోరన్న నమ్మకమూ లేదు.

Show comments