చినబాబు తోపా .. ఆయన ద్వారా రంజాన్‌ తోఫా!

అడిగేవారు లేకపోతే చెలరేగిపోయే వారు హద్దులు చెరిపేసుకుంటూ, నిబంధనలు తుంగలో తొక్కేసుకుంటూ దూసుకెళ్తారు. అవును మరి... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్షం నిస్తేజంగా ఉందిలే అనుకుంటున్నారో.. ప్రతిపక్షం నరాల సత్తువ మొత్తం తాము లాగేస్తున్నాం లెమ్మని పొగరుతో ప్రవర్తిస్తున్నారో గానీ.. అధికారంలో ఉన్న వారు పార్టీకి - ప్రభుత్వానికి తేడా లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించిన రంజాన్‌ తోఫా వితరణ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బాబు చేతుల మీదుగా నడిపించడం అనేది ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. నిర్వాహకులకు అసలు- ప్రభుత్వానికి - పార్టీకి మధ్య ఉన్న వ్యత్యాసం అర్థమవుతున్నదా... లేదా.. మాకు మించిన తోపు ఎవరున్నారు? మమ్మల్ని అడిగే వారెవరున్నారు? అని చెలరేగుతున్నారా? అర్థం కావడం లేదు! 

చంద్రబాబునాయుడు... ఒకసారి ప్రజలకు తాయిలాలు రుచి చూపించి.. వారి ఓట్లను సొంతం చేసుకోవడం ప్రారంభించిన తర్వాత.. ప్రతిసారీ చాన్సు దొరికినప్పుడెల్లా.. వారికి ఏదో ఒక తాయిలాలు ఇస్తూన్న సంగతి తెలిసిందే. పండగలు వచ్చినప్పుడెల్లా రేషన్‌ కార్డు ఉన్న వారికందరికీ చంద్రన్న కానుక అంటూ పండగకు అవసరమయ్యే సరుకులు ఉచితంగా పంపిణీ చేయడం అనేది రివాజుగా మారిపోయింది. ఇదంతా పౌరసరఫరాల శాఖ వారి కార్యక్రమంగా సాగుతుంది. అచ్చంగా ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే. 

అయితే విజయవాడలో వైకాపానుంచి తెలుగుదేశంలో చేరి.. ప్రస్తుతం మైనారిటీ కోటాలో మంత్రిపదవి కోసం ఎగబడుతున్న ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ రంజాన్‌ సందర్భంగా ఈ రంజాన్‌ తోఫా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది అచ్చంగా ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అక్కడితో వ్యవహరం ముగియలేదు. ముస్లిం లబ్ధిదారులకు చంద్రన్న చిత్రం ముద్రించిన సంచుల్లో సరుకులను ఉచితంగా పంపిణీ చేయడం అనే పర్వం లోకేష్‌ చేతుల మీదుగానే జరిగింది. 

'చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలి' అంటూ హాజరైన జనంతో నినాదాలు చేయించడం వరకూ వారి ఆరాటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేని లోకేష్‌ ద్వారా కార్యక్రమంజరిపించడం ఏమిటో అర్థం కావడం లేదు. అదే కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు బోండా ఉమా, జలీల్‌ఖాన్‌ అందరూ ఉన్నారు. కానీ సర్కారు వారి తరఫున వితరణ మాత్రం పార్టీ నేత లోకేష్‌ చేసేశారు. అయినా లోకేష్‌ సారధ్యంలో పార్టీ వచ్చి ప్రభుత్వం మీద పెత్తనం చేస్తున్నదనడానికి ఇలాంటి బరితెగింపు ఉదాహరణలు ఎన్నెన్నో జరుగుతున్నాయని జనం అనుకుంటున్నారు. 

Show comments