అప్పుడు అవమానం...ఇప్పుడు అభిమానం...!

మనది సమాఖ్య వ్యవస్థ. అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమానంగా చూడాలి. సమాన అవకాశాలు కల్పించాలి. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కొన్ని రాష్ట్రాలకు మినహాయింపులు, రాయితీలు ఉండొచ్చేమోగాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల పక్షపాతం చూపించకూడదు. ఫలాన ప్రాంతానికో, రాష్ట్రానికో ప్రత్యేక ప్రయోజనం కలిగించేలా వ్యవహరించకూడదు. ప్రధానంగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలను అవమానించేలా, చిన్నచూపు చూసేలా ప్రవర్తించకూడదు. ఇలా చేస్తే రాష్ట్రాల ఆత్మగౌరవం దెబ్బ తింటుంది. తద్వారా ద్వేషం ప్రబలే ప్రమాదముంటుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని రెండుసార్లు తీవ్రంగా అవమానించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అభిమానించింది. అప్పుడు అవమానించడానికి, ఇప్పుడు అభిమానించడానికి కారణాలేమిటో కరెక్టుగా తెలియదు. ఈ అవమానం, అభిమానం వెనక కథ ఏమిటి? ఏం అంశానికి సంబంధించింది? ఇది కొందరికి చిన్న విషయంగా కనబడొచ్చుగాని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఆవేదన చెంది కఠిన నిర్ణయం కూడా తీసుకున్న ఉదంతమిది. 

అసలు విషయం ఏమిటంటే...జనవరి నెల అనగానే దేశ ప్రజలందరికీ గుర్తొచ్చే జాతీయ పర్వదినం ‘రిపబ్లిక్ డే’ (జనవరి 26). దేశమంతా ఈ పండుగను సంబరంగా జరుపుకుంటున్నా దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కార్యక్రమంపైనే అందరి దృష్టి ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం అక్కడి రాజ్‌పథ్‌లో జరిగే త్రివిధ దళాల కవాతు, సైనికుల అద్భుత విన్యాసాలు, మన సైనిక పాటవాన్ని, బలగాల ధీశక్తిని తెలియచేసే ఆయుధాల ప్రదర్శన మొదలైనవాటితోపాటు అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు కూడా కనువిందు చేస్తాయి. వివిధ రాష్ట్రాలు తమ సంస్కృతీ సంప్రదాయాలను, అభివృద్ధి పథకాలను తెలియచేసే శకటాలు ప్రదర్శిస్తాయి. ఉమ్మడి రాష్ర్ట విభజన వరకు ఆంధ్రప్రదేశ్ శకటం ఇందులో పాల్గొనేది. 2014లో విభజన తరువాత తెలంగాణ రాష్ట్రానికి శకటాల ప్రదర్శనలో స్థానం ఇవ్వాల్సివచ్చింది. విభజన రిపబ్లిక్ డే తరువాత జరిగింది కాబట్టి మరుసటి సంవత్సరం అంటే 2015లో తెలంగాణ శకటం పాల్గొనాల్సివుంది. తెలంగాణకు అదే మొదటి గణతంత్ర దినోత్సవం. 

అప్పుడు ‘బోనాలు పండుగ’ కాన్సెప్టుతో శకటం తయారీకి సర్కారు ప్రతిపాదన పంపింది. ఎంపిక కమిటీ దాన్ని తిరస్కరించింది. దీంతో ప్రభుత్వం షాక్‌కు గురైంది. తమది కొత్త ప్రభుత్వమని, తొలిసారి రిపబ్లిక్‌డే పెరేడ్‌లో పాల్గొంటున్నందున నిరాశకు గురిచేయొద్దని తెలంగాణ ఎంపీలు రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్‌ను అభ్యర్థించారు. ఆ గండం గడిచిపోయింది. కాని ఈ ఏడాది (2016) అదే సీన్ రిపీట్ అయ్యింది. గణతంత్ర దినోత్సవంలో తెలంగాణ పాలుపంచుకోకుండా శకటాల ఎంపిక కమిటీ కొర్రీలు పెట్టింది.  ఈ కమిటీ రక్షణ శాఖ జాయింట్  సెక్రటరీ నేతృత్వంలో పనిచేస్తుంది. శకటాల ఎంపికకు ప్రతి రాష్ర్టం రెండు మూడు డిజైన్లు, కాన్సెప్టులు (నమూనాలు) తయారుచేసి అక్టోబరులోనే (2015) ఎంపిక కమిటీకి పంపాలి. ఆ డిజైన్లు, కాన్సెప్టులు పరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేసి తెలియచేస్తే ఆ శకటాన్ని రాష్ర్ట ప్రభుత్వం రూపొందిస్తుంది. అదే పరేడ్‌లో చోటుచేసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం  మూడు కాన్సెప్టులు ఎంపిక కమిటీకి పంపింది.  ఒకటిసమ్మక్క సారలమ్మ జాతర, రెండుప్రసిద్ధ నాట్యం పేరిణి, మూడుబతుకమ్మ. వీటిలో ఒకటి ఎంపిక చేయాలి. కాని ఎంపిక కమిటీ మూడింటినీ తిరస్కరించింది.

మూడుసార్లు సమావేశమైన ఎంపిక కమిటీ మూడుసార్లూ తెలంగాణ కాన్సెప్టులను పక్కకు పెట్టింది. విచిత్రమేమిటంటే ఏ కారణాలతో తిరస్కరించారో కూడా సమాచారం ఇవ్వలేదు. ‘అయ్యా మా కాన్సెప్టులను ఎందుకు తిరస్కరించారు?’ అని అడిగితే ‘అవి మా ప్రమాణాలకు అనుగుణంగా లేవు’ అని కమిటీలోని సభ్యులు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసుకున్న కాన్సెప్టులు మూడూ సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించివే. మరి వీటికి ఎంపిక కమిటీ అభ్యంతరం ఎందుకు చెప్పిందో అర్థం కాలేదు. తాము నిర్థారించిన ప్రమాణాలకు (స్టాండర్డ్స్) అనుగుణంగా కాన్సెప్టులు లేవని మాత్రమే చెప్పింది. మరి ఆ ప్రమాణాలు ఏవి? అనే విషయం ప్రభుత్వానికి ముందే తెలియచేయలి కదా. ఆ పని చేయలేదు. దీంతో హర్ట్ అయిన ఎంపీలు, ప్రభుత్వ పెద్దలు కేంద్రాన్ని బతిమాలే ప్రసేక్త లేదని తేల్చిపారేశారు. అందుకే ఈ ఏడాది రిపబ్లిక్‌డే దినోత్సవంలో తెలంగాణ రాష్ర్ట శకటం కనబడలేదు. ఈ రిపబ్లిక్ దినోత్సవానికే కాదు, భవిష్యత్తులో (టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంతవరకు) ఏ గణతంత్ర దినోత్సవంలోనూ తెలంగాణ శకటం కనబడకూడదని  ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడం, ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీయడమే ఇందుకు కారణమని తెలిపింది. Readmore!

కాని కాలక్రమంలో పరిస్థితి మారిపోయినట్లుగా ఉంది. టీఆర్‌ఎస్ సర్కారు తన నిర్ణయాన్ని సడలించుకున్నట్లుగా కనబడుతోంది.కేంద్రం తెలంగాణపై అభిమానం చూపుతోంది. వచ్చే ఏడాది (2017) గణతంత్ర దినోత్సవానికి శకటాన్ని పంపాలని కేంద్రమే అడిగిందో, రాష్ర్ట ప్రభుత్వమే ప్రతిపాదించిందో సరిగా తెలియదుగాని రిపబ్లిక్ డే ఉత్సవంలో రాష్ర్ట శకటం పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. రాష్ర్టం పంపిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. బతుకమ్మ ఆటపాట శకటం త్రీడీ నమూనాను రక్షణ శాఖ నిపుణుల కమిటీ అంగీకరించింది. ఇది బాగుందని సంతృప్తి వ్యక్తం చేసిందట...! శకటాల ఎంపిక కోసం నిర్వహించిన చివరి సమావేశంలో తెలంగాణ శకటానికి ఆమోదం లభించడం విశేషం.  

మేనా

Show comments

Related Stories :