భాషే చనిపోతుంటే లోకేష్‌ ఎంత?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్‌ చాలాకాలం నుంచి వార్తల్లో వ్యక్తి. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు. మంత్రి కాబోతున్నాడు. కాబట్టి మీడియాలో ఆయన  వార్త లేని రోజు ఉండదు. కొత్త ఎమ్మెల్సీయే కాకుండా కొత్త మంత్రి కూడా. వీటికి తోడు ముఖ్యమంత్రి కుమారుడు. ఇక ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా మీడియాకు వార్తే. అందుకేనేమో ఆంగ్ల పత్రిక 'డెక్కన్‌ క్రానికల్‌' లోకేష్‌ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన రోజే ఆయనకు సంబంధించిన వార్తను ప్రముఖంగా, బ్యానర్‌గా ప్రచురించింది. ఏమిటది? శుభవార్త? అప్పుడే లోకేష్‌ గురించి గుడ్‌ న్యూస్‌ ఏముంటుంది? ప్రమాణం చేసేటప్పుడు సాధారణంగా దొర్లే అపశృతి ఇది. కాని లోకేష్‌ సీఎం కుమారుడు కావడంతో ప్రాధాన్యం ఏర్పడింది. ప్రతిపక్ష నేత జగన్‌ అసెంబ్లీలో సీఎం చంద్రబాబుకు ఇంగ్లీషు రాదని విమర్శిస్తే డెక్కన్‌ క్రానికల్‌ పత్రిక లోకేష్‌ తెలుగులోని ప్రమాణ పత్రాన్ని సరిగా చదవలేకపోయాడని, తప్పులు దొర్లాయని రాసింది. ఇంకా కొందరు ఎమ్మెల్సీలు ప్రమాణం చేసినా వారి ప్రమాణాల గురించి రాయలేదు. 

'సార్వభౌమాధికారం'..'శ్రద్ధాసక్తులు' పదాలను సరిగా ఉచ్చరించలేకపోయాడని, కష్టపడి పలికాడని రాసింది. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేటప్పుడు ఇలాంటి అపశృతులు దొర్లుతుంటాయి. కేసీఆర్‌ తెలంగాణలో అధికారంలోకి రాగానే రెండు టీవీ ఛానెళ్లపై నిషేధం విధించడానికి ఆ టీవీల్లో ప్రసారమైన 'మంత్రివర్గ సభ్యుల ప్రమాణంలో అపశృతులు' ఎపిసోడే కారణం కదా. ఈ ఎపిసోడ్‌ను ప్రసారం చేసినందుకే కేసీఆర్‌ ఆగ్రహించారు. 'వుయ్‌ రిపోర్టు..యూ డిసైడ్‌' ఛానెల్‌ అపశృతుల ఎపిసోడ్‌ తాము ప్రసారం చేయలేదని మొత్తుకున్నా కేసీఆర్‌ వినలేదు. ఆ ఛానెల్‌ పైనే నెలల తరబడి నిషేధం కొనసాగింది. మరో ఛానెల్‌ పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పి కేసీఆర్‌ ఆగ్రహం చల్లార్చడానికి  తెలంగాణకు ప్రత్యేక ఛానెల్‌ ప్రారంభించింది. లోకేష్‌ మాత్రమే కాదు, ఆయనవంటి లక్షల మంది పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువు కుంటున్నారు కాబట్టి క్లిష్టమైన (సమాసాలు, ఒత్తులున్న పదాలు) తెలుగు పదాలు పలకలేరు.

టీవీ యాంకర్లను, న్యూస్‌ రీడర్లను చూస్తూనే వున్నాం కదా. తెలుగు టీవీ ఛానెళ్లలో ముప్పావు భాగం ఆంగ్లమే ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు టీవీ ఛానెళ్లలో పనిచేస్తున్న యాంకరమ్మలు, రిపోర్టర్లు ఎక్కువమంది ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నవారే. వీరు ఇంగ్లిషులో ఆలోచించి తెలుగులో మాట్లాడతారు. వీరందరి తెలుగు తప్పులతడకగా ఉంటోంది. లోకేష్‌కే కాదు, ప్రతిపక్ష నేత జగన్‌కూ తెలుగు సరిగా రాదు. ఆయన సుదీర్ఘ, ఆశపూరితమైన ప్రసంగాలు వింటే అర్థమవుతుంది. సరైన వాక్య నిర్మాణం ఉండదు. చెప్పదల్చుకున్న విషయాల మధ్య పొంతన ఉండదు. చంద్రబాబు, ఎన్టీ రామారావు కూడా కొన్ని తెలుగు పదాలు పలకలేరు. వారి ప్రసంగాలు వింటే ఈ విషయం తెలుస్తుంది. ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలుగు ఉపన్యాసం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసిందే. అది ఏపీలోని ఏ ప్రాంతపు తెలుగో అర్థం కాదు. లోకేష్‌ మేనమామ కమ్‌ మామగారు నందమూరి బాలయ్య ఎంత చక్కటి తెలుగు మాట్లాడతాడో సినిమా ఫంక్షన్లలో విన్నాం. 

రెండు రాష్ట్రాల్లోని నాయకుల్లో చాలమంది సరైన తెలుగు మాట్లాడలేరు. ప్రస్తుత నేతల్లో తెలంగాణ యాసలో చక్కగా మాట్లాడే వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రమే. ఆయన సహజంగా మాట్లాడే తీరును ఏపీ ప్రజలూ మెచ్చుకుంటారు. అన్ని పార్టీల్లోని సీనియర్‌ నాయకుల్లో తెలుగు మీడియం నేపథ్యంగా ఉన్నవారూ ఉన్నారు. అయినప్పటికీ అనేక తప్పులతో మాట్లాడతారు. భాషను సరిగా ఉపయోగించలేకపోవడానికి, ఉచ్చరించలేకపోవడానికి అనేక కారణాలుంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుకు పాలకులు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. తెలుగు మీడియం పాఠశాలలు అనవసరమని మూసేస్తున్నారు. విదేశీ భాషలు నేర్చుకొమ్మంటున్నారు. బతకానికి ఇంగ్లీషు ఒక్కటి చాలనే భావన ప్రజల్లో ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు తమ పిల్లలకు తెలుగు మాట్లాడటం వస్తోంది కదా... అది చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. తప్పులు మాట్లాడుతున్నారో, ఒప్పులు మాట్లాడుతున్నారో అనవసరమంటున్నారు. కాబట్టి ఈ తరం పిల్లలకు, యువతకు తెలుగు రాదనుకోవడం, వారిని విమర్శించడం అనవసరమే. తెలుగు రాకపోయినా వారు కొత్తగా నేర్చుకోరు. చంద్రబాబు ప్రసంగాల తీరే ఇప్పటికీ  మార్చుకోలేదు. ఇక కొడుకు నేర్చుకునేదేముంది? భాషే చచ్చిపోతుంటే లోకేష్‌ను అనుకొని ఏం లాభం? 

Show comments