'సైనా' - 'శ్రద్ధ'గా చేయాల్సిన సినిమా.!

మొన్న అజారుద్దీన్‌ మీద సినిమా.. నిన్న ధోనీ మీద సినిమా.. లేటెస్ట్‌గా సచిన్‌ టెండూల్కర్‌ మీద సినిమా.. ఇప్పుడేమో, సైనా నెహ్వాల్‌ మీద సినిమా.. ఇప్పుడంతా బయోపిక్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. బీటిల్లో చాలావరకు విజయం సాధించినవే. 'మేరీకోమ్‌' సినిమా అయితే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బయోపిక్స్‌ అన్ని సందర్భాల్లోనూ వీజీ కాదు. 'మేరీకోమ్‌' లాంటి సినిమాలైతే కత్తి మీద సామే. ఇప్పుడు 'సైనా' సినిమా కూడా అంతేనంటోంది బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. 

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ కోసం శ్రద్ధా కపూర్‌ని ఎంపిక చేసిన విషయం విదితమే. తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా 'సైనా' సినిమాని అభివర్ణిస్తోందామె. ఇప్పటికే, ఈ సినిమా కోసం ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టేసిందట శ్రద్ధా కపూర్‌. ముందు ముందు ఈ సినిమా కోసం సైనా నెహ్వాల్‌ దగ్గర కొన్ని సూచనలు, సలహాలు కూడా తీసుకుంటానని అంటోందామె. 

నిజానికి శ్రద్ధా కపూర్‌ ఏ సినిమా చేసినా, ఆ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తుంటుంది. 'బాఘీ' సినిమా కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంది. ఇప్పుడీ 'సైనా' సినిమా కోసం బ్యాడ్మింటన్‌ నేర్చుకుంటుందట. 'రానున్న రోజుల్లో నేను చాలా చాలా కష్టపడాల్సి వుంది.. సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ అంటే చిన్న విషయం కాదు.. ఆమె యూత్‌ ఐకాన్‌.. ఏ మాత్రం తక్కువ చేసినా తేడా కొట్టేస్తుంది.. అందుకే, చాలా అప్రమత్తంగా వుంటాను..' అంటూ 'సైనా' మూవీ గురించి, ఆ సినిమా కోసం తాను పడాల్సిన కష్టం గురించీ చెప్పుకొచ్చింది శ్రద్ధా కపూర్‌.

Show comments