ర్యాగింగ్‌ స్పెషలిస్ట్‌ రామ్‌గోపాల్‌ వర్మ

ట్విట్టర్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడంలో వర్మ దిట్ట. ఎవర్నీ వదిలిపెట్టడాయన. నచ్చితే సరేసరి, నచ్చలేదంటే మాత్రం ర్యాగింగ్‌ ఓ రేంజ్‌లో వుంటుంది. కొన్ని సినిమాలకి భజన ఎలా చేస్తారో, ఇంకొన్ని సినిమాల్ని అలాగే తూలనాడేస్తారు. 'అంతా నా ఇష్టం' అన్నట్టు వర్మ వ్యవహరిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆయన భజన ఎవరికి చేస్తున్నారో, ఎవర్ని తూలనాడుతున్నారో ఆయన ట్వీట్ల పరంపర చూస్తే ఇట్టే అర్థమయిపోతుంటుంది. ఎవరిష్టం వారిది. వర్మ కొందర్ని ఇష్టపడ్తారు, వారిని తన భుజానికెత్తుకుంటారు.. వర్మ కొందర్ని ఇష్టపడరు.. వారిని తూలనాడతారు. సోషల్‌ మీడియా అండగా వున్నప్పుడు వర్మ చెలరేగిపోవడంలో వింతేముంది.? 

ఇక, తాజాగా వర్మ మిగతా పనులన్నీ పక్కన పడేసి మరీ నాగబాబు మీద విరుచుకుపడ్డం షురూ చేసేశారు. వర్మ ఎప్పటినుంచో మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తున్నా, మెగా కాంపౌండ్‌ ఇప్పటిదాకా స్పందించలేదు. నాగబాబు ఎప్పుడైతే స్పందించారో, యుద్ధం మొదలయ్యింది. వర్మతో పెట్టుకుంటే ఇంతే.. అన్నట్టుగా వర్మ ర్యాగింగ్‌ కొనసాగుతోంది. ఈ ర్యాగింగ్‌ ప్రస్తుతం వరుణ్‌ తేజ దగ్గరకు చేరుకుంది. వరుణ్‌ తేజ, నాగబాబు మాటల్ని వినకూడదట. చిరంజీవిని చూసి నేర్చుకోవాలట. ఏంటో మరి, వర్మ లాజిక్‌. 

'నువ్వంటే నాకిష్టం, అది నీకూ తెలుసు..' అంటూ వర్మ, వరుణ్‌ తేజకి సోషల్‌ మీడియాలో ఇచ్చిన ఉచిత సలహాలు కాస్త కామెడీగా, కాస్త ఇంట్రెస్టింగ్‌గా వున్నాయి. వరుణ్‌, తన తండ్రి నాగబాబు మాటని వింటాడా.? వర్మ ఉచిత సలహాల్ని నమ్ముతాడా.? ఏంటో, వర్మ ఆలోచన.. తండ్రిని కాదని తన మాటల్నే వరుణ్‌ వింటాడని ఎలా అనుకుంటున్నాడో ఏమో.! ఇదో టైపు మైండ్‌ గేమ్‌.. అనుకోడానికి బాగానే వున్నా, వర్మ తాపత్రయం పుణ్యమా అని వర్మ ర్యాగింగ్‌ చేస్తున్నాడో, లేదంటే ఆయనే ఈ ఎపిసోడ్‌లో అనవసరంగా అభాసుపాలవుతున్నాడో అర్థం కాని పరిస్థితి. 

మొత్తమ్మీద, వర్మ ర్యాగింగ్‌ స్పెషలిస్ట్‌ అన్పించేసుకున్నాడు.. అది ముదిరి పాకాన పడ్తోందిప్పుడు. ఈ ర్యాగింగ్‌ ఎప్పటిదాకా కొనసాగుతుందో ఏమో వేచి చూడాల్సిందే.

Show comments