వీర హిందుత్వ వాదం కామసూత్ర పై కన్నేశారు..!

పిచ్చి కుదిరింది.. రోకలిని తలకు చుట్టమన్నాడట వెనుకటికి ఒకడు. ఇప్పడు వీర హిందుత్వ వాదుల కథ ఇలానే ఉంది. ప్రఖ్యాత భారతీయ గ్రంథం కామసూత్ర దేశానికి చెడ్డపేరు తీసుకొస్తోందని మొదలుపెట్టేశారు. ప్రఖ్యాత ఖజురహో ఆలయం వద్ద ఈ వివాదం మొదలైంది.

విశ్వవిఖ్యాత, యూనెస్కో చేత వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఖజురహో ఆలయం వద్ద కామసూత్ర పుస్తకాలు అమ్ముతున్నారనేది హిందుత్వవాదుల గోల. వాటి అమ్మకాలను నిషేధించేయాలని భజరంగ్ సేన అనే వీర హిందుత్వ వాద సంస్థ డిమాండ్ చేస్తోంది.

ఎందుకంటే.. కామసూత్ర వల్ల దేశానికి చెడ్డ పేరు వచ్చేస్తోందని.. ఖజురహో చూడటానికి వచ్చే విదేశీయులు వాటిని కొంటున్నారని, దీని వల్ల ఇండియాకు చెడ్డ పేరు వస్తోందనేది వీర హిందుత్వ వాదుల మాట. 

మరి కామసూత్ర ఎక్కడ పుట్టింది, దాని ప్రశస్తి ఏమిటో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. వాత్సాయనుడు రాసిన ఈ శృంగార గ్రంథానికి మించిన పుస్తకం మరోటి ఉండదనే చెప్పాలి. శతాబ్దాలుగా కామసూత్ర భారతీయుల గర్వకారణంగా నిలస్తూ వచ్చింది.

అసలు ‘కామసూత్ర’ అనే పేరే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధం. భాషతో సంబంధం లేకండా ఈ సంస్కృత గ్రంథాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. ఎప్పుడో క్రీస్తు శకం రెండో శతాబ్దంలో జనించిన ఆ గ్రంథం దేశం పరువు తీస్తోందని నడమంత్రపు హిందుత్వ వాదులు మొదలుపెట్టడం ప్రహసనంగా మారింది.

ఓవర్ సెన్సిటివ్ గా రియాక్ట్ అయిపోతూ.. ఓవర్ యాక్షన్ చేయడమే హిందుత్వ వాదం అయిపోయింది ఈ దేశంలో. ఒకాయనేమో.. నెమళ్లు సెక్స్ చేయవంటాడు, ఇంకోయాన గోమూత్రం నుంచి బంగారం పుడుతుందని అంటాడు, ఇంకోరు గర్భిణులు సెక్స్ కి , మాంసాహారానికి దూరంగా ఉండాలని అంటారు.. మరి దేశాన్ని ఎటు తీసుకెళదామని అనుకుంటున్నారో మరి.

Show comments