దోచుకునే రాచమార్గం.. దానిపేరు పోలవరం!!

‘‘పోలీసులకు జేబులో చిల్లర తగ్గినప్పుడల్లా రోడ్డు పక్కన నిల్చుని వాహన చోదకులకు చలాన్లు వేయడం మొదలెడతారని’’

‘‘సర్కారుకు ఆదాయం తగ్గిందనిపించినప్పుడు.. లిక్కరు బిజినెస్ మీద ఫీజులు పెంచేస్తారని’’

... ఇలా రకరకాల జోకులు మనలో ప్రచారంలో ఉంటాయి. 

అదే మాదిరిగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలను గమనిస్తే... పాలన సాగిస్తున్న వారు అడ్డగోలుగా దోచుకోవడానికి పోలవరం అనేది ఒక రాచమార్గంగా మారుతున్నదేమో అని అనిపిస్తోంది. పోలవరం నిర్మాణం విషయంలో.. వాటి ఎస్టిమేట్లను సవరించి కాంట్రాక్టర్లు అడిగిందే తడవుగా వందల వేల కోట్ల రూపాయల నిధులను సంతర్పణ చేయడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం కనబరుస్తున్న అత్యుత్సాహం గమనిస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే!

ఇప్పటికే పోలవరం పనులు చేస్తున్న ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టే నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు సర్కారు.. తాజాగా వారు విన్నవించుకున్నదే తడవుగా మరో వెయ్యి కోట్ల రూపాయలు ధారాదత్తం చేసేయడానికి రాచమార్గంలో ఓ కమిటీని వేయడం జరిగినదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని కొత్త పద్ధతులను కూడా.. తామే కనుగొని చంద్రబాబు సర్కారు దోపిడీ సాగించడానికి తెగబడుతున్నదనే విమర్శలూ వస్తున్నాయి. 

కాంగ్రెస్ పాలన సాగుతున్న రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు పనులు కాంట్రాక్టులు ఫైనల్ అయ్యాయి. అప్పట్లో ఈపీసీ పద్ధతిలో ఈ కాంట్రాక్టు కేటాయించారు. అంటే ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ అంటారు. ఆ పద్ధతిలో ఒకసారి ధరలు ఫైనల్ అయిన తర్వాత.. ఇక పూర్తయ్యేవరకు వాటిని సవరించడం ఉండదు. అయితే చంద్రబాబు సర్కారు ఆ విధానాల్ని తుంగలో తొక్కేసింది. 

ట్రాన్స్‌ ట్రాయ్, త్రివేణి సంస్థలు తమకు గిట్టుబాటు కావడంలేదంటూ ప్రభుత్వానికి ఓ లేఖ రాసుకున్నాయి. వాటిని పరిశీలించి వాస్తవ ధరల ఆధారంగా చెల్లింపులు ఇచ్చే అంశాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కంపెనీ కోరినట్లుగా మరో వెయ్యి రూపాయల అదనపు చెల్లింపులు చేయడానికి ముద్ర వేయడానికే ఈ కమిటీ ఏర్పాటు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే చంద్రబాబునాయుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత.. ట్రాన్స్ ట్రాయ్ కు అనుచిత లబ్ధి జరిగేలా పోలవరం పనుల అంచనాలను చాలా భారీగా సవరించారు. 35 వేల కోట్ల రూపాయలుగా ఉన్న మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని చంద్రబాబు 75 వేల కోట్ల రూపాయలకు పెంచేశారని.. 40 వేల కోట్ల రూపాయలను అక్రమంగా అందరూ కలిసి పంచేసుకున్నారని కాంగ్రెస్ పలు సందర్భాల్లో ఆరోపణలు గుప్పిస్తూ ఉంటుంది కూడా!

అవన్నీ ఒక ఎత్తు కాగా.. తాజాగా మట్టితరలింపు దూరాల మార్పు ముసుగేసి మరో వెయ్యి కోట్ల రూపాయలను సంతర్పణ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని పోలవరం అథారిటీ అధికారిని కూడా ‘మమ’ అనడానికి ఉద్దేశించిన ఈ కమిటీలో ప్రభుత్వం నియమించింది. పోలవరం పనుల ఎస్టిమేట్లను రివైజ్ చేసే ముసుగులో రాచమార్గంలో.. చంద్రబాబు సర్కారు అయిన కాడికి దోచుకుంటోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Show comments