'శశి' పదవిలో లేకుండా ఉప ఎన్నిక?

జయలలిత మరణం తరువాత ఆమె ప్రియ సఖి శశికళ జీవితం ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతోంది. ఇది సస్పెన్స్‌ సినిమాను తలపిస్తోంది. ఏ క్షణంలో ఏం జరగుతుందో అర్థం కాక ఆమె వర్గీయులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌, ఇతర నాయకులు ప్రజలకు భారీగా ముడుపులు ఇచ్చారనే అభియోగాలు రావడం, ఒక మంత్రి సహా కొందరిపై ఆదాయపన్ను శాఖ విస్తృతంగా దాడులు చేయడంతో ఎన్నికల కమిషన్‌ ఆ ఎన్నిక నిర్వహణను రద్దు చేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియదు. 'రెడ్డొచ్చె మొదలాడు' అన్నట్లుగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నిక ప్రక్రియ ప్రారంభిస్తారేమో...! ఇంతకంటే ఎక్కువ డబ్బు చేతులు మారిన లేదా పంపిణీ చేసిన సందర్భాల్లోనూ ఎన్నికలను వాయిదా వేయలేదు. కాని ఈసారి ఎన్నికల కమిషన్‌ అసాధారణ నిర్ణయం తీసుకోవడంతో శశికళ జాతకం తిరగబడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక కథ మొదటికి రావడంతో శశికళ కళ ముగింపునకు వచ్చిందని అర్థం చేసుకోవాలా? ఏమిటి ఆమె కథ? అనేక ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతున్న శశికళ జీవితంలో మరో ముఖ్యమైన ఎపిసోడ్‌ ఉంది. దాని ఫలితం ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. శశికళ ప్రస్తుతం అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవిలో ఉంది. అన్నాడీఎంకేలో శశికళ సభ్యత్వం మధ్యలో బ్రేక్‌ అయింది కాబట్టి పార్టీ ఆమెను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసింది. ఈ ఎన్నిక చెల్లదని, ఆమెకు పదవిలో ఉండే అర్హత లేదని, ఆ పదవిలో ఆమె ఉండటం పార్టీ నిబంధనలకు విరుద్ధమని మాజీ ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం వర్గం, అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

దీన్ని విచారణకు స్వీకరించిన ఎన్నికల సంఘం శశికళ నుంచి వివరణ కూడా తీసుకుంది. ఈ వివాదంపై తీర్పు చెప్పాల్సివుంది. ఏప్రిల్‌ 12న ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక అయిపోయిన తరువాత వారం రోజుల్లో తీర్పు చెప్పనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అంటే సుమారుగా ఏప్రిల్‌ 17 లేదా 18న తీర్పు రావల్సివుంది. ఇప్పుడు ఎన్నిక రద్దయింది కాబట్టి ఈలోగానే తీర్పు వస్తుందా? ఇప్పుడు దీనిపై తమిళనాడులోనే కాదు, జాతీయస్థాయిలో ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఈ తీర్పు శశికళ రాజకీయ జీవితాన్నే కాకుండా తమిళనాడు రాజకీయాలనే మలుపు తిప్పే, కుదిపేసే అవకాశముంది. తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే   ఆమె రాజకీయ జీవితం ముగిసిపోయినట్లుగా భావించవచ్చేమో...! సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆమె పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఇది ఆమెకు పెద్ద దెబ్బ. ఆ దెబ్బ మీద 'ఎన్నిక చెల్లదు' దెబ్బ పడుతుందా? అదే జరిగితే శశికళ పదవిలో లేకుండానే ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక జరగొచ్చు. ఒకవేళ తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తే అది పన్నీరుకు చావు దెబ్బగా పరిణమిస్తుంది. ఆయన రాజకీయ జీవితం ప్రమాదంలో పడుతుంది. 

ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక వాయిదా వెనక బీజేపీ (కేంద్ర ప్రభుత్వం) హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. శశికళ భవిష్యత్తును బుగ్గి చేయడానికే కేంద్రం ఈ పని చేయించిందని చిన్నమ్మ వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌ మండిపడుతున్నాడు. ఉప ఎన్నికను రద్దు చేసినా తన విజయం ఆగదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. పన్నీరు శెల్వం కూడా ఇదే ధీమాతో ఉండొచ్చు. మొన్నటివరకు చేసిన ప్రచారంలో శశికళ వర్గంపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహించినట్లు వార్తలొచ్చాయి. ఈ వర్గం ప్రజాగ్రహానికి భయపడి కరపత్రాల్లో, వాల్‌పోస్టర్లలో శశికళ బొమ్మ వేయలేదు. ఆమె పేరు కూడా ప్రస్తావించలేదు. నాయకులు కూడా చిన్నమ్మ పేరు ఉచ్చరించలేదు. మళ్లీ  ఉప ఎన్నిక జరిగేనాటికి ఇదే పరిస్థితి ఉంటుందా? మార్పొస్తుందా?

Show comments