తూచ్‌ చినబాబు నన్నేమీ అన్లే.!

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రుల్లో ఒకరైన కేఈ కృష్ణమూర్తి విషయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అవమానకరంగా వ్యవహరిస్తున్నారంటూ చాలాకాలంగా గాసిప్స్‌ విన్పిస్తున్న విషయం విదితమే. ఈ కోవలోనే తాజాగా మరో డిప్యూటీ సీఎం.. పైగా హోంమంత్రి కూడా అయిన నిమ్మకాయల చినరాజప్ప పేరు కూడా తెరపైకొచ్చింది. సోషల్‌ మీడియాలో చినరాజప్ప వర్సెస్‌ నారా లోకేష్‌.. అంటూ పెద్ద రచ్చే జరుగుతోంది. 

అంతర్గతంగా కేఈ కృష్ణమూరి - లోకేష్‌ - నారాయణ వివాదం ముదిరి పాకాన పడ్తోంటే, చినరాజప్ప వ్యవహారంపై బాహాటంగానే వివాదం ముదిరి పాకాన పడింది. దాంతో, అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారో ఏమోగానీ, 'చినబాబు నన్నేమీ అన్లే..' అంటూ ఆయన వివరణ ఇచ్చుకున్నారు. 'కావాలనే కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. నన్ను లోకేష్‌ ఎప్పుడూ తక్కువగా చేసి చూడలేదు.. టీడీపీలో గొడవలు సృష్టించడానికే ఈ కథనాలు..' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 

ఓ తెలుగు సినిమాలో హీరో, విలన్‌ని కొట్టకుండానే కొట్టానంటూ ప్రచారం షురూ చేస్తాడు. ప్రజా ప్రతినిథి అయిన ఆయనగారు, తీవ్ర అవమానభారంతో కుంగిపోతూనే, నన్నెవరూ కొట్టలే.. అంటాడు. ఆ కథ ఇప్పుడు గుర్తుకొస్తోంది తెలుగు జనాలకి. రాజావారి పుత్రరత్నం.. యువరాజావారు చాచి లెంపకాయ కొట్టినాసరే, కంట్లోంచి కన్నీరు రాకూడదు.. 'యువరాజా దెబ్బ ఉంది మహారాజా.. అత్యద్భుతం..' అని కితాబులిచ్చితీరాల్సిందే. ఎందుకంటే, అది రాచరికం. 

ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ తీరు కూడా ఇలాగే వున్నట్టుంది. సీనియర్ల పరిస్థితి జూనియర్ల చేతిలో అత్యంత దయనీయంగా మారిపోయింది. అయినాసరే, పళ్ళికిలించాల్సిందే. ఉప ముఖ్యమంత్రుల పరిస్థితే ఇలా వుంటే, మిగతా మంత్రుల పరిస్థితి ఏంటట.?

Show comments