అవినీతి అంటే అధికారులే కనిపిస్తారా.?

చంద్రబాబు చాలా తెలివైన రాజకీయ వేత్త. ఆయన వ్యూహాలు, ఆయన చాణక్యాలు ఆయనకు వున్నాయి. అయితే ఇటీవల కొంతకాలంగా ఆయన ప్రధాని మోడీ అడుగుజాడల్లో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన మరో మోడీ టెక్నిక్ ను భలేగా ఒడిసి పట్టుకున్నారు. ఆయన స్ట్రాటజీ భలేగా వర్కవుట్ చేసుకుంటున్నారు. దాన్ని ఆయన అనుకూల మీడియా కూడా భలేగా ఒడిసి పట్టుకుంటోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, నోట్ల రద్దు తరువాత జనాలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. చేతిలో డబ్బులు లేక, ఏటిఎమ్ ల్లో డబ్బులు రాక, ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. మోడీ ప్రయోగం వికటించిందని, జనం మోడీకి వ్యతిరేకం అవుతారలని అనుకున్నారంతా.

సరిగ్గా అప్పుడే నిత్యం పత్రికల్లో ఒకే తరహా వార్తలు కనిపించడం ప్రారంభించాయి. భారీగా కొత్తనోట్లు పట్టేసుకోవడం, భారీగా పాతనోట్ల రద్దు కారణంగా బడా బడా బాబులు పూర్తిగా కుదలైపోవడం వంటి వార్తలు ఇవి. దీంతో సామాన్య జనం తమ భాధలు మరచిపోయారు. మోడీ బడా బాబులను నానా ఇబ్బందులు పెట్టి కార్నర్ చేస్తున్నారని మురిసిపోయారు.

ఇప్పుడు ఇన్నాళ్లు గడచిపోయిన తరువాత ఇక ఆ తరహా వార్తలు కనిపించడం మానేసాయి. మళ్లీ నోట్ల కట్టలు మెలమెల్లగా అవసరం అయిన చోట్లకు చేరుకుంటున్నాయి. రాజకీయాలు, సినిమా, కాంట్రాక్టులు ఇలాంటి రంగాల్లో మళ్లీ యథాశక్తి నగదు ట్రాన్షాక్షన్లు హ్యాపీగా జరిగిపోతున్నాయి. జనం కష్టాలు మాత్రం అలాగే వున్నాయి.

ఇదిలా వుంటే ఆంధ్ర విషయం చూద్దాం. గడచిన మూడు ఏళ్లుగా రాజకీయ నాయకుల దందాకు పగ్గాలు లేకాండా పోయింది. ఇసుక, కాంట్రాక్టులు, భూదందాలు ఇలా ఒకటేమిటి? అందిన చోటల్లా అందుకున్నారు. ఇదంతా జనాల్లోకి బాగా పాకిపోయింది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు కూ అర్థమయింది.

అందుకే కొత్త ఎత్తుగడ వేసారు. అవినీతి అంతం అన్న ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం ఓ హెల్ప్ లైన్ నెంబర్ స్టార్ట్ చేసారు. అక్కడితో ఆగలేదు. ఒకరిద్దరు రాజకీయ నాయకులు సైతం దొరికారు. వాళ్లను పార్టీ నుంచి సాగనంపారు. అయితే ఇలా సాగనంపిన వాళ్లంతా ఒకే సామాజికవర్గం వారు కావడం విశేషం. ఆ విధంగా ఆ సామాజిక వర్గం వాళ్లే ఎక్కువ అవినీతి పరులు అనే ముద్రవేసే ప్రయత్నం జరుగుతోందని ఓ గుసగుస వినిపిస్తోంది.

అక్కడితో ఆగలేదు. అధికారుల మీద పడ్డారు. అవినీతి అధికారులను పట్టుకోవడం, పట్టించడం ప్రారంభమైంది. ఇప్పుడు నిత్యం అధికారులు అవినీతి వార్తలు పత్రికల ఫ్రంట్ పేజీలను ఆక్రమిస్తున్నాయి. చంద్రబాబు అవినీతి అధికారుల భరతం పడుతున్నారనే ప్రచారం మెల్లగా అండర్ కరెంట్ గా సాగడం ప్రారంభమైంది.

అవినీతి ఎవరు చేసినా భరతం పట్టడం మంచిదే. కానీ మూడేళ్ల పాటు పగ్గాలు వదిలేసి, రాశులు పోగేసుకున్న రాజకీయనాయకులను వదిలేసి, ఉద్యోగస్థులను మాత్రం టార్గెట్ చేస్తూ, ప్రజల్లో మొత్తం అవినీతినే తుడిచిపెట్టేస్తున్నామన్న ఫీలింగ్ కలిగించే ప్రయత్నం చేస్తుండడం మాత్రం కరెక్ట్ కదు. ఇది జస్ట్ రాబోయే ఎన్నికలను దృష్టిలో వుంచుకుని రచిస్తున్నరాజకీయ తంత్రం తప్పవేరు కాదు.

ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేయదు. అధికార ప్రతినిధులు నికార్సుగా వుంటే, ఉద్యోగులు తప్పుదారిన నడవరు. కానీ వాళ్లే అవినీతికి కొమ్ముకాస్తుంటే,కీలక మైన పోస్టింగ్ ల కోసం భారీగా దండేసుకుంటుంటే, వీళ్లు ఎలా సంపాదించి, పూడ్చుకోవాలా అని చూస్తారు.

నిజంగా అవినీతిపై చిత్తశుద్ది వుంటే మూడేళ్లలో ఏ రాజకీయ నాయకుడు ఎలా సంపాదించాడో అప్పట్లో మీడియా తెగ వార్తలు అందించింది. వాళ్లందరి వ్యవహారాలు కూడా పట్టించుకుంటే అప్పుడు జనం కచ్చితంగా ఆదరిస్తారు. లేదంటే ఇదంతా ఎన్నికల ముందు స్టంట్ మాత్రమే అని జనాలు ఫిక్సయిపోతారు. కానీ అదే టైమ్ లో రాజకీయ నాయకులను వదిలేసి, తమను మాత్రం టార్గెట్ చేస్తున్నారని ఉద్యోగులు గుస్సాయించే ప్రమాదం కూడా వుంది.

Show comments