నోట్ల మార్పిడి: బీజేపీ ఎంపీనే దుమ్మెత్తిపోశాడే!

అసలు ఆయన దేశంలో లేడట.. ఉండుంటే డైరెక్టుగా ఎవరి మీద అటాక్ చేసేవాడో, ఇక్కడి పరిస్థితులను గమనించి ఉంటే ఇంకెంతలా దుమ్మెత్తిపోసేవాడో కానీ.. నోట్ల మార్పిడి వ్యవహారంపై తీవ్రమైన విమర్శలే చేశాడు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి హాంకాంగ్ వెళ్లిన స్వామిని మీడియా ఈ వ్యవహారం గురించి అడుగగా.. ప్రణాళిక రహితంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డాడు. 

మోడీ స్థాయి నిర్ణయం.. మాస్టర్ స్ట్రోక్ అని, బ్రహ్మాండం అని భక్తులు అంటుంటే.. స్వామి మాత్రం సరైన ప్లాన్ లేకుండా ఇలాంటి నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నించాడు. నోట్ల మార్పిడిలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిలయ్యిందని… ఈ వ్యవహారం ప్రజలను గందరగోళంలో పడేసిందని వ్యాఖ్యానించాడు. 

తగురీతిలో స్పందించి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన ఆర్థిక శాఖ పై స్వామి విమర్శనాస్త్రాలు సంధించాడు. ఆర్థిక శాఖ ది క్షమార్హమైన నేరం కాదని అన్నాడు. ఈ వ్యవహారం తనను బాధిస్తోందని స్వామి పేర్కొన్నారు.

ఇదీ.. ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ స్పందన. సంచలన నిర్ణయం తీసుకుంటే చాలదు, దాన్ని అమల్లో పెట్టడంలో కూడా అదే స్థాయి చేవ ఉండాలి, ప్రణాళిక ఉండాలి అని.. ఎవరైనా చెబితే, కస్సున వారి మీద ఎగిరెగిరి పడుతున్న భక్తులు .. తమ ట్రూప్ సభ్యుడు, తమ ట్రూప్ కు నాయకుడు అయిన స్వామి అభిప్రాయాన్ని ఒక సారి పరిగణనలోకి తీసుకోవాలి. 

Show comments