ఏం నాయనా.. మరో లడ్డూ కావాలా.?

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, గౌరవ ప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన మార్కండేక ఖట్జూ తరచూ వివాదాలను ఆశ్రయిస్తుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ఖట్జూ, తాజాగా భారత్‌ - పాకిస్తాన్‌ మధ్య దశాబ్దాలుగా మంట పుట్టిస్తోన్న 'కాశ్మీర్‌' అంశంపై సెటైర్లు సంధించడం వివాదాస్పదమయ్యింది. 

కాశ్మీర్‌ విషయంలోనే భారత్‌, పాక్‌ మధ్య పంచాయితీ తెగడంలేదు. భారతదేశంలో వున్న కాశ్మీర్‌ని, భారత ఆక్రమిత కాశ్మీర్‌గా పాకిస్తాన్‌ అభివర్ణిస్తోంది. ఆ కాశ్మీర్‌ని లాక్కోవాలన్నది పాకిస్తాన్‌ వ్యూహం. ఇప్పటికే కాశ్మీర్‌లో కొంత భాగాన్ని పాకిస్తాన్‌ తన సొంతం చేసుకుంది. అదే పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌. ఆజాద్‌ కాశ్మీర్‌ నినాదంతో తీవ్రవాదుల్ని భారత్‌పైకి పాకిస్తాన్‌ ఎగదోస్తోంది. ఈ పరిస్థితుల్లో దేశమంతా ఒక్కతాటిపై నిలవాల్సి వుంది. 

కానీ, ఇంత సీరియస్‌ అంశంలోనూ 'హ్యూమర్‌'ని వెతుక్కున్నారు ఖట్జూ. కాశ్మీర్‌ కావాలా.? అయితే, దాంతోపాటుగా బీహార్‌ని కూడా ఇచ్చేస్తాం తీసుకోమని, (గతంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఉటంకిస్తూ) పాకిస్తాన్‌కి సోషల్‌ మీడియా వేదికగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించేశారు ఖట్జూ. ఇవ్వడానికి ఆయనెవడు? తీసుకోవడానికి పాకిస్తాన్‌కేంటి సంబంధం? అన్నది వేరే అంశం. 

సోషల్‌ మీడియాలో వివాదం ముదిరి పాకాన పడటం, పచ్చి బూతులు తిడుతూ ఖట్జూపై నెటిజన్లు విరుచుకుపడ్డంతో, ఆయన కంగారుపడ్డారు. 'సీరియస్‌గా అనలేదు, జస్ట్‌ జోక్‌ చేశానంతే.. బీహార్‌ కూడా ఇచ్చేస్తామంటే, కాశ్మీర్‌ గురించి పాకిస్తాన్‌లోనివారు ఆలోచించడం మానేస్తాను.. ఎందుకంటే బీహార్‌ అంత భయంకరమైనది వారికి..' అంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మళ్ళీ ఈసారి బీహారీలు ఖట్జూపై విరుచుకుపడ్డారు. దానికి సమాధానంగా 'బీహార్‌ అంటే నాకు చాలా గౌరవం.. గౌతమబుద్ధుడు, చంద్రగుప్త మౌరుడు, అశోకుడు లాంటి దిగ్గజాలు బీహార్‌ నుంచే వచ్చారు..' అని మళ్ళీ కవరింగ్‌ ఇచ్చేశారు ఖట్జూ. 

ఇదిలా వుంటే, ఖట్జూపై దేశద్రోహం కేసు పెట్టాలంటూ బీహార్‌ బీజేపీ నేత వినోద్‌ నారాయణ్‌ ఝా డిమాండ్‌ చేస్తున్నారు. భారత సమగ్రతను దెబ్బతీసేందుకు, జాతి వ్యతిరేక శక్తులతో ఖట్జూ చేతులు కలిపారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆయన ఆరోపించారు. 

ఓ పక్క, అంతర్జాతీయ వేదికలపై 'కాశ్మీర్‌ మాది.. మేం ఒక్క అంగుళాన్ని కూడా వదులుకునే ఆలోచనతో లేం.. కాశ్మీర్‌పై పాకిస్తాన్‌ ఆశలు పెట్టుకోవడం మానెయ్యాలి..' అంటూ భారత్‌ తన వాయిస్‌ని బలంగా విన్పిస్తున్న వేళ ఖట్జూకి ఇలాంటి కుళ్ళు జోకులు వెయ్యాలని ఎలా అన్పించిందో ఏమో.!

Show comments