వెంకీ మరీ చిన్నపిల్లాడైపోతున్నాడు

స్టార్‌డమ్‌ వచ్చాక, హుందాతనం ప్రదర్శించాల్సిందే. అలా హుందాగా వుండాలంటే బిగుసుకుపోవాల్సిందే. కానీ, వెంకటేష్‌ అలా కాదు. టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకున్నా, చాలా జోవియల్‌గా వుంటాడు. వెంకీ మొదట్లో పెద్దగా ఎక్కడా కన్పించేవాడు కాదుగానీ, ఈ మధ్య వెంకీ ఎక్కడుంటే అక్కడ సందడి.. అన్నట్లుగా మారిపోయాయి పరిస్థితులు. సెలబ్రిటీ క్రికెట్‌ పోటీలు జరుగుతున్నాయంటే చాలు, అక్కడ వెంకీ హంగామా ఓ రేంజ్‌లో వుంటుంది. 

ఇక, రియల్‌ క్రికెట్‌లోనూ వెంకీ హంగామా తక్కువేమీ కాదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌ రైజర్స్‌ జట్టుకి మద్దతిస్తోన్న వెంకీ, వీలైనంతవరకు సన్‌ రైజర్స్‌ తలపడే అన్ని పోటీలకూ హాజరవుతుంటాడు. ఏదో వీఐపీ గ్యాలరీలో కూర్చుని, సీరియస్‌గా మ్యాచ్‌ని తిలకించేయడమో, తప్పదన్నట్టు జెండా ఊపడమో కాదు, బంతి బంతికీ హంగామా చేస్తూ, చిన్న పిల్లాడిలా మారిపోతున్నాడు. 

నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జట్టు బౌలర్‌ భువనేశ్వర్‌కుమార్‌ తొలి వికెట్‌ తీయగానే వెంకీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్వతహాగా క్రికెట్‌పై వున్న ఇంట్రెస్ట్‌, దానికి తోడు సన్‌ రైజర్స్‌ జట్టు తమ సొంత జట్టు అన్న భావన.. వెరసి, వెంకీ, ఫుల్‌ జోష్‌లో సన్‌రైజర్స్‌ జట్టుకి మద్దతుగా సందడి చేశాడు. వెంకీ సందడి చూసినవాళ్ళంతా, వెంకీ మరీ చిన్న పిల్లాడైపోతున్నాడని అనుకున్నారు. 

Show comments