బాబుగారి స్విస్‌ ప్రేమ: హైకోర్టు ఝలక్‌

'ఎవరేమనుకున్నా డోన్ట్‌ కేర్‌.. చెయ్యాలనుకున్నది చేస్తానంతే..' ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్‌ వైఖరి. మన దేశంలో స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై ఎన్నో విమర్శలున్నాయి. కేంద్రమే ఓ సందర్భంలో (గతంలో) స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిని తప్పు పట్టింది. కానీ, చంద్రబాబుకి మాత్రం స్విస్‌ ఛాలెంజ్‌ అంటే విపరీతమైన ప్రేమ. అందునా, స్విస్‌ ఛాలెంజ్‌లో రహస్యాలపై ఇంకా అమితమైన ప్రేమ. ఆ స్విస్‌ ఛాలెంజ్‌ ఏంటో, ఆ విధానం ద్వారా రాష్ట్రానికి ఒరిగేదేమిటో మాత్రం చంద్రబాబు చెప్పరుగాక చెప్పరు. 

స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతి పేరుతో సింగపూర్‌ కన్సార్టియంకి మేలు చేసి, తద్వారా రాష్ట్రానికి అన్యాయం చేసే చర్యలకు చంద్రబాబు మొగ్గు చూపుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి 'స్విస్‌ ఛాలెంజ్‌' పద్ధతిని చంద్రబాబు ఎంపిక చేశారుగానీ, హైకోర్టులో చంద్రబాబు సర్కార్‌కి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. స్విస్‌ ఛాలెంజ్‌ని వ్యతిరేకిస్తూ కొన్ని నిర్మాణ సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిపై స్టే విధించింది. 

'స్టే' విధించినంతనే రాజధాని నిర్మాణం ఆగిపోతుందనో, స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిని చంద్రబాబు వదులుకుంటారనో అనుకోవడానికి వీల్లేదు. చంద్రబాబు సర్కార్‌ ఎటూ, కౌంటర్‌ దాఖలు చేసేందుకు న్యాయస్థానం అవకాశమిచ్చింది గనుక, మసిపూసి మారేడుకాయని చేసి.. 'హంబక్‌' అన్పించేస్తారనుకోండి.. అది వేరే విషయం. 

అయితే, స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై వివిధ సంస్థల అభ్యంతరాల్ని స్వీకరించి, హైకోర్టు 'స్టే' ఇచ్చిందంటేనే, ఇందులో మాయాజాలం వుందని లెక్క. ఆ మాయాజాలం ఏంటన్నదానిపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పెదవి విప్పుతారా.? అంటే, ప్చ్‌.. అలా ఆశించడం అత్యాశే అవుతుంది. చంద్రబాబుకి మాత్రమే స్విస్‌ ఛాలెంజ్‌లో 'రహస్యాలపై' అవగాహన వుంటుంది. మంత్రులకు సైతం ఈ విషయంలో అంత సీన్‌ లేదు. 

హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసి, స్టేని కొట్టివేయించడం.. అది కుదరకపోతే, సుప్రీంకోర్టుని ఆశ్రయించడం.. ఇలా చంద్రబాబు ముందు చాలా ఆప్షన్స్‌ వున్నాయి. మొన్నటికి మొన్న ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, ఆ కేసులో తనపై ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశిస్తే.. తన 'నిప్పు'తనాన్ని నిరూపించుకోవాల్సింది పోయి, స్టే తెచ్చుకున్న విషయం విదితమే. ఇక్కడా అంతే.

Show comments