'పింక్‌'తో తాప్సీ దశ తిరిగిపోద్ది.!

తాప్సీ బాలీవుడ్‌లో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది. అయితే, అన్ని సినిమాల్లోకీ 'పింక్‌' వెరీ వెరీ స్పెషల్‌ అంటోంది. నటిగా తనలోని కొత్త కోణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుందని తాప్సీ ధీమా వ్యక్తం చేస్తోంది. 'పింక్‌' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అమితాబ్‌ బచ్చన్‌ అయితే, ఇప్పటిదాకా తన కెరీర్‌లోనే ఇలాంటి పాత్ర పోషించలేదని చెబుతుండడం గమనార్హం. 

ఓ న్యాయవాదిగా ఈ చిత్రంలో నటిస్తున్న అమితాబ్‌ బచ్చన్‌, కొందరు వ్యక్తుల చేతిలో లైంగిక దాడులకు గురైన యువతుల తరఫున వాదించే క్రమంలో తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారట. తాప్సీ ఈ సినిమాలో తాను చేస్తున్న పాత్ర, ప్రస్తుత సమాజంలో లైంగిక దాడులకు బలైపోయిన చాలామంది యువతుల మానసిక సంఘర్షణను చూపిస్తుందని చెబుతోంది. 

ఇక, ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఈ సినిమాని చూసేశారు. అలా సినిమాని విడుదలకు ముందే చేసినవారిలో మన టాలీవుడ్‌ నటుడు రాణా కూడా వున్నాడు. 'ఈ సినిమా ఈ దేశానికి అవసరం' అంటూ రాణా వ్యాఖ్యానించాడంటే సినిమాలో ఎంత 'మేటర్‌' వుందో అర్థం చేసుకోవచ్చు. 

ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కూడా ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగా అలాంటి ఘటనలు అనేకం జరిగాయి. వాటిని నిరోధించేందుకు తెరపైకొచ్చిన నిర్భయ చట్టం కూడా లైంగిక దాడుల్ని ఆపలేకపోతోంది. సమస్య ఎక్కడ వుంది.? చట్టాల్లోనా.? చట్టాల అమలులోనా.? అన్న అంశాల చుట్టూ ఈ చిత్ర కథ సాగుతుందట. ఈ సినిమాతో నటిగా తన దశ తిరిగిపోద్దని చెబుతోన్న తాప్సీ మాటల్లో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.

Show comments