ఈస్ట్ లో ఏం జరుగుతోంది?

అసలు ఏం జరుగుతోంది..మిగిలిన ప్రాంతాలకు అంతగా తెలియడం లేదు. కానీ ఈస్ట్ గోదావరిలో వ్యవహారం వేరుగా వుంది. మిగిలిన జిల్లాల నుంచి భారీగా పోలీసులను ఈస్ట్ గోదావరికి తరలించారు. నిన్న మొన్నటి దాకా రాజమంఢ్రిలో అది కూడా కేవలం ఆసుపత్రి పరిసరప్రాంతాల్లోనే పోలీసులను మోహరించారు, బారికేడ్లు కట్టారు. కానీ ఈరోజు జిల్లాలోని అన్ని కీలక ప్రాంతాల్లో పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎక్కడిక్కడ టెంట్ లు తాత్కాలిక ఏర్పాట్లు వేసి, పోలీసు పికెట్ లు ఏర్పాటు చేసారు. 

దక్షిణ,ఉత్తర కోస్తా జిల్లాలను వదలిసి ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పోలీసులును తరలించినట్లు తెలుస్తోంది.  ముద్రగడ దీక్ష కొనసాగుతోంది అన్న విషయం స్పష్టమైపోయింది. రెండురోజుల క్రితం ఫ్లూయిడ్స్ తీసుకున్నారు..విరమించినట్లే అన్న మాటలు వినిపించారు మంత్రులు. మరోపక్క కాపునేతలపై కాపేతర తెలుగుదేశం నేతలు కూడా విమర్శలు ప్రారంభించారు. అరెస్టయిన వారిలో చాలా మందికి బెయిల్ వచ్చసింది. మిగిలిన వారికి టెక్నికల్ ప్రోబ్లమ్ కాబట్టి, సోమవారం రావడానికి అవకాశం వుంది. 

అంటే అప్పటి వరకు ముద్రగడ విషయంలో ఏమీ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా లేనట్లు అర్థమైపోతోంది. ఈలోగా అనుకోనిది ఏమైనా జరిగితే పరిస్థితులు విషమించే ప్రమాదం వుందన్నది వాస్తవం. అందుకే ఒక్క ఆ విషయం మీదనే ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.  ఎటువంటి చెడు సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ముందస్తుగా జాగ్రత్తగా పోలీసులను మోహరించడం తప్పు కాదు. కానీ పోలీసులను ఎక్కడిక్కడ మోహరించి, వారిని చూపించి కాపుల ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేయడం మాత్రం సరికాదు. 

అసలు నిజానికి ప్రభుత్వం కాస్త ట్రాన్స్ పెరిన్సీగా వ్యవహరిస్తే సమస్య ఇంతవరకు వచ్చి వుండేది కాదు. కాపు నాయకులను, కాపు సెలబ్రిటీలను ముద్రగడను చూసేందుకు అనుమతించి వుండాల్సింది. అప్పుడు వారు ముద్రగడతో సమాలోచనలు జరిపే వీలు వుండేది. ముద్రగడ డిమాండ్ల సాధ్యా సాధ్యాలు వారిలో వారు చర్చించుకునే అవకాశం వుండేది. అప్పుడు సమస్య పరిష్కారానికి ఓ మార్గం ఏర్పడేది.  కానీ ప్రభుత్వం అలా చేయడం లేదు. 

ముద్రగడను దారిలోకి తేవాలని, ఈ దెబ్బతో మళ్లీ ముద్రగడ ఉద్యమ బాట పట్టకుండా చేయాలనే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇది ఇప్పుడు వికటించేలా కనిపిస్తోంది. కాపుల మంత్రులకు బదులు కాపేతర నాయకులు విమర్శలు ప్రారంభించినపుడే విషయం తేడా వస్తోందని అర్థమైపోయింది. పదే పదే కాపు మంత్రులతో, కాపు సెలబ్రిటీలపై విమర్శలు చేయించడం ఇక సాధ్యం కాదని తేలిపోయింది. 

బహుశా కాపు మంత్రులు బాబుకు ఈ విషయంలో తమ అసక్తత చెప్పివుండొచ్చు.  అందువల్ల ఇక ఇప్పుడు బాబు చేయాల్సింది ఒక్కటే కాపు జేఎసి ని రమ్మనమని, చర్చలకు స్వాగతించడమే. అది కూడా తక్షణం చేయాల్సిన పని. లేదంటే చేతులు కాలిపోయాక, ఆకులు పట్టుకుని ప్రయోజనం వుండకపోవచ్చు..అది బాబు జీవితంలో చేసిన అతి పెద్ద తప్పిదంగా మారిపోయినా ఆశ్చర్యం లేదు. 

Show comments