తమిళ రాజకీయం.. సీన్ మారిపోయింది!

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం, పార్టీ పవర్  శశికళ చేతిలో… వీళ్లిద్దరి మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతుందని అనుకున్నారంతా. అయితే, రెండు మూడు రోజుల్లోనే వీరి మధ్యన రాజీ కుదిరినట్టుగా కనిపిస్తోంది. చిన్నమ్మ ఆశీస్సులతో ప్రభుత్వాన్ని నడిపిస్తామని.. పన్నీరు ప్రకటించడమే దీనికి రుజువు. ఆమెతో ఆధిపత్య పోరు కన్నా.. ఆమెతో లొంగిపోయినట్టుగా వ్యవహరిస్తేనే మంచిదన్నట్టుగా పన్నీరు భావిస్తున్నాడని అనుకోవాల్సి వస్తోంది. 

‘అమ్మ’ పోయింది, ‘చిన్నమ్మ’ మిగిలింది.. అన్నట్టుగా మారుతున్నాయి అన్నాడీఎంకే రాజకీయాలు. అప్పుడే శశికళకు పాదాభివందనాలు మొదలయ్యాయి. ఇన్ని రోజులూ జయ ముందు సాష్టాంగ పడిన అన్నాడీఎంకే నేతలు ఇప్పుడు శశి ముందు సాష్టాంగపడుతున్నారు. చిన్నమ్మకు జై కొడుతున్నారు. అచ్చం జయలలిత విషయంలో ఎలా వ్యవహారించారో.. చాలా మంది నేతలు ఇప్పుడు శశికళ విషయంలో అలాగే వ్యవహరిస్తున్నారు.

అన్నింటికీ మించి పన్నీరు సెల్వం పూర్తిగా లొంగిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. ఆమె ఆశీస్సులతో ప్రభుత్వాన్ని నడుపుతానని ఆయన ప్రకటిస్తున్నాడు. ఇక శశికళ ఆధిపత్యాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు ఒప్పుకోరనే వార్తలు ఆదిలో వచ్చినప్పటికీ, స్వయంగా ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తే ఆమెకు అనుకూలుడిగా మారిపోవడంతో ఎమ్మెల్యేల్లో కూడా శశితో సున్నం పెట్టుకునే వాళ్లు ఉండరేమో అనుకోవాల్సి వస్తోంది.

ఇక జయలలిత మేనకోడలు, జయలలిత చెల్లెలు కూతురు.. వంటి వాళ్లు శశి మీద ఎన్ని మాటలు మాట్లాడినా ప్రయోజనం లేదనే చెప్పాలి. ఓవరాల్ గా శశికళ ఆక్రమణ మాత్రమే కాదు.. ఆధిపత్యం కూడా మొదలైనట్టే. ప్రజల నుంచి ఎలాంటి బేస్ లేని ఈమె ఎన్ని రోజులు దీన్ని నడపగలదనేదే.. ప్రశ్న! 

Show comments