ఇక్కడ, ఇప్పుడు గెలవలేకపోతే.. టీడీపీ మరెక్కడా గెలవలేదు!

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఖాళీచేసి సొంతంగా పార్టీ పెట్టుకుని తను రాజీనామా చేసి, తన తల్లి చేత కూడా రాజీనామా చేయించి.. కడప, పులివెందులకు ఉపఎన్నికలు తెచ్చినప్పుడు కూడా కాంగ్రెస్‌ పార్టీ ఇంతస్థాయిలో తొట్రుపాటు పడలేదు. నేటి తెలుగుదేశం పార్టీతో పోలిస్తే నాటి కాంగ్రెస్‌ పార్టీ చాలా వీక్‌గా ఉండింది. అధిష్టానం నామినేట్‌ చేసిన ముఖ్యమంత్రి అయిన కిరణ్‌ కుమార్‌రెడ్డి, ప్రజల్లో బేస్‌మెంట్‌ లేని కాంగ్రెస్‌ ఎంపీలు, అప్పటికే తీవ్రస్థాయికి చేరిన ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు తెలంగాణ ఉద్యమం.. అవన్నీ కలిసి కాంగ్రెస్‌ పార్టీని చాలా వీక్‌ చేశాయి. ప్రభుత్వాన్ని దెబ్బతీశాయి. అలాంటి పరిస్థితుల మధ్య వచ్చాయి కడప ఎంపీ సీటుకు, పులివెందుల అసెంబ్లీ సెగ్మెంటుకు ఎన్నికలు!

కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశాల మేరకు కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ ఎన్నికలను ఎదుర్కొంది ప్రభుత్వం. ఎలాగంటే.. దాదాపు పది, పదిహేను మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు.. కడపకు అటువైపు ఉండే నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌ నేతలు, ఇటువైపు ఉండే అనంతపురం జిల్లా కాంగ్రెస్‌ లీడర్లు.. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, మంత్రులు.. కొంతమంది ఢిల్లీ స్థాయి నేతలు.. వీళ్లంతా కడప సందుల్లోకి వచ్చారు. జగన్‌పై ఇష్టానుసారం మాట్లాడారు, జగన్‌ తమ పార్టీలోనే ఉండుంటే అతడిని మంత్రిని చేసేవాళ్లం, ఆపై ముఖ్యమంత్రిని చేసేవాళ్లం.. అనడంతో మొదలుపెట్టి.. తమ దగ్గర ఉన్న అన్ని ఆయుధాలనూ కాంగ్రెస్‌ పార్టీ కడప, పులివెందుల నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో వాడేసింది.

నాడు కాంగ్రెస్‌ పార్టీ చేసిన హడావుడికి.. తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు తందానా అన్నాయి. జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా నాడు తెలుగుదేశం పార్టీ యాక్టివ్‌ రోల్‌ నుంచి ప్యాసివ్‌ రోల్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. తెలుగుదేశం అభ్యర్థులు డమ్మీగా మారారు.. కాంగ్రెస్‌ చేతిలో పవర్‌ ఉంది కాబట్టి, ఆ పార్టీకే అనుకూలంగా పనిచేస్తే.. జగన్‌ను దెబ్బ కొట్టవచ్చని తెలుగుదేశం భావించింది. ఆ విధంగా కాంగ్రెస్‌ హడావుడికి తోడు.. తెలుగుదేశం కూడా తోడయ్యింది. ఇక తెలుగుదేశం అనుకూల పత్రికలు అయితే.. పులివెందుల్లో విజయమ్మ ఓడిపోతుంది.. అంటూ మొదలుపెట్టాయి. వివేకానందరెడ్డిదే విజయం అని బెట్టింగులు వేసుకోవచ్చు.. మా సర్వేల్లో అదే తేలింది అని పచ్చపత్రికలు అనేసరికి కొంతమంది అలా కూడా పందేలు కాశారు పాపం!

కట్‌ చేస్తే.. దాదాపు ఆరేళ్లు గడిచిపోయాయి. అప్పుడు కడప, ఇప్పుడు రాయలసీమలోనే మరో నియోజకవర్గం. ఈసారి కొత్త పార్టీలేవీ ఆరంభం కాలేదు, చెప్పాలంటే కడపతో పోలిస్తే.. అంత ప్రతిష్టాత్మక ఎన్నిక కూడా కాదు. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం అంతకు మించి! అన్నట్టుగా వ్యవహరిస్తోంది.

కడప ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు హడావుడి చేసినమాట వాస్తవమే... కానీ, మరీ నోటిఫికేషన్‌ రాకుండానే పాతిక మంది ఎమ్మెల్యేలను కడపకు, పులివెందులకు పంపలేదు. అరడజను మంది మంత్రులు అక్కడ హడావుడి చేయలేదు.. ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షలు నిర్వహించలేదు, ఇప్పుడు నారా లోకేష్‌లా నోటిఫికేషన్‌ రాకనే అక్కడ తేలలేదెవరూ! అత్యంత బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరువు నిలుపుకోవాలని చేసిన ప్రయత్నాల కంటే.. ఇప్పుడు తెలుగుదేశం ఎక్కువపాట్లు పడుతోంది.

ఒకవైపు మా సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి.. మా నిజాయితీనే మమ్మల్ని గెలిపిస్తుంది.. చంద్రబాబు పాలనే మమ్మల్ని గెలిపిస్తుంది... అంటూ కథలు చెబుతున్నారు. మరోవైపు మాత్రం.. తెలుగుదేశం పార్టీ పడరాని పాట్లు పడుతోంది. ఒక్క ఎమ్మెల్యే సీటులో పార్టీ పరువు నిలపడానికి ఇరవైమంది ఎమ్మెల్యేలను, ఐదుమంది ఎమ్మెల్సీలను, ఆరుమంది మంత్రులను... మరో డజనుమంది లోకల్‌ లీడర్లను దింపడం ఏమిటో! ప్రతి ఐదువేల మంది ఓటర్లకూ ఒక లీడర్‌ అన్నమాట. 

ఇదంతా ఒకఎత్తు.. మరోవైపు వందలకోట్ల రూపాయల విలువైన పథకాలకు కొబ్బరికాయలు కొట్టడాలు, ఇళ్లకు దరఖాస్తులు తీసుకోవడాలు, మేం గెలిస్తేనే ఇళ్లు వస్తాయి.. లేకపోతే రావు.. అని హెచ్చరించడాలు, శంకుస్థాపన చేసిన ఈ ప్రోగ్రామ్‌ పూర్తి కావాలన్నా.. నంద్యాల్లో టీడీపీని గెలిపించాల్సిందే అని బెదిరించడాలు... ఇవన్నీ అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ చేయలేదు. కానీ.. ఇప్పుడు తెలుగుదేశం చేస్తోంది. తమ పరువును నిలబెట్టుకోవడానికి సామదాన బేధ దండోపాయాలన్నీ ఉపయోగిస్తోంది. తన బేలస్థితిని తెలియజేస్తోంది.

నంద్యాల విషయంలో టీడీపీ కష్టపడుతున్న తీరును చూస్తుంటే.. ఆ పార్టీ ఇప్పుడు గనుక, ఇక్కడ గనుక గెలవకపోతే.. మరెక్కడా గెలవలేదేమో! అనిపించకమానదు. ఎందుకంటే.. మరే నియోజకవర్గంలో కూడా టీడీపీ ఇంతలా కష్టపడటానికి సాధ్యంకాదు. మూడేళ్ల పాలన అనంతరం జరుగుతున్న, అది కూడా సానుభూతి తెలుగుదేశం వైపే ఉన్న ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ ఇంత కష్టపడుతోంది. విజయంపై నమ్మకంలేక.. కానాకష్టం పడుతోంది. వేలకోట్ల రూపాయల హామీలను ఇచ్చేస్తోంది.. వందల కోట్లు ఖర్చుపెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. మరి వచ్చింది కేవలం ఒక్క నియోజకవర్గం ఉపఎన్నిక కాబట్టి.. ఇంత కష్టపడటానికి వీలు అవుతోంది. కానీ.. రేపు 175 నియోజకవర్గాల్లోనూ ఒకేసారి ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇంత దృష్ఠి సారించినా... సందుకో ఎమ్మెల్యేను దించినా.. నంద్యాల్లో రేపు టీడీపీ గనుక ఓడిపోతే.. కడపలో కాంగ్రెస్‌కు ఎదురైన పరాభవం కంటే దారుణమైన అనుభవం ఎదురయినట్టే. కడపతో కాంగ్రెస్‌ పతనం మొదలైనట్టుగా.. నంద్యాల నుంచి టీడీపీ కౌంట్‌డౌన్‌ మొదలైనట్టే.. నో డౌట్‌!

Show comments