రాజకీయాల్లోనూ రీమేక్ లేనా పవన్ కల్యాణ్?!

ఆల్రెడీ తీసేసిన సినిమాను తీస్తే.. చూడటానికి అందులో ఏముంటుంది? ఆల్రెడి డబ్బింగ్ తో విడుదలైపోయిన సినిమాను మళ్లీ తీసి.. నేనేం తీసినా చూస్తారని, తన అభిమానుల స్థాయిని పవన్ కల్యాణ్ తగ్గించాడు. వరస రీమేక్ లతో సొంతంగా ఏం చేయలేడేమో.. రీమేక్ లు మాత్రమే చేయగలడేమో.. అనే అభిప్రాయాన్ని తన మీద సగటు ప్రేక్షకులకు కల్పించాడు. ఒకవైపు ట్రెండ్ ను ఫాలో కాను, ట్రెండ్ ను సెట్ చేస్తా.. అని పవన్ కల్యాణ్ సినిమాల్లో డైలాగులైతే పెట్టుకున్నాడు కానీ, వాస్తవంలోకి వచ్చే సరికి మాత్రం రీమేక్ లు చేయడమే ఆయన సెట్ చేసే ట్రెండ్ అయిపోయింది. ఫాలో కావడమే ఆయన క్రియేట్ చేసిన ట్రెండ్ అయ్యింది. కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా పవన్ కల్యాణ్ ది రీమేక్ ట్రెండ్ లానే కనిపిస్తోంది! దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి.

నాటి రాజధాని రైతులను కలవడంతో మొదలుపెడితే.. నేడు అగ్రిగోల్డ్ బాధితులను కలవడం వరకూ అన్ని వ్యవహారాల్లోనూ జగన్ ను ఫాలో అయిపోతున్నాడు జనసేన అధినేత. జగన్ మోహన్ రెడ్డి ఏదైనా సమస్యను ప్రస్తావించాడంటే.. దానిపై అసెంబ్లీ వరకూ చర్చ జరిగిందంటే.. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో పడిందంటే.. ఆ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి మైనస్ మార్కులు పడ్డాయంటే.. తక్షణం పవన్ కల్యాణ్ ఆ మ్యాటర్ మీద కన్నేస్తాడు. దానిపై స్పందిస్తాడు! అగ్రిగోల్డ్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీపై ఉన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. మూడు సంవత్సరాల నుంచి ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకుండా తాత్సారం చేయడాన్ని బట్టే.. దీనిపై తెలుగుదేశం విజన్ అర్థం అవుతోంది. మూడేళ్ల కిందట ఈ వ్యవహారం ఎక్కడ ఉందో.. ఇప్పుడు అక్కడే ఉంది. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడం మాట అటుంచి, మనకెంత దక్కుతుంది.. అనే ధోరణితోనే ప్రభుత్వంలోని పెద్దలు వ్యవహరిస్తున్నారు.

ఆఖరికి హాయ్ ల్యాండ్ ను అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో ప్రస్తావించలేదంటే.. వీరి తెంపరి తనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కాదు.. ఏడాది కిందటే అగ్రిగోల్డ్ అంశం.. అసెంబ్లీని కుదిపేసింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు డిమాండ్ చేస్తే.. తెలుగుదేశం విచిత్రమైన సలహా ఇచ్చింది. కొత్త కమిటీ వస్తే.. విచారణ ఆలస్యం అవుతుంది, అందుకే వేయడం లేదు.. అని మంత్రి వర్యులు సెలవిచ్చారు. ప్రస్తుత సమావేశాల్లోనేమో.. ‘అవసరమైతే’ సీబీఐ విచారణకు ఆదేశిస్తాం.. అని ప్రకటించారు. మరి మూడేళ్ల సమయం గడిచిపోయింది.. అనేక మంది ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, బాధితులూ చనిపోయారు.. ఇప్పుడేమో.. ‘అవసరమైతే..’ అంటూ మాట్లాడుతున్నారు తెలుగుదేశం నేతలు.

ఇలాంటి నేఫథ్యంలో తెలుగుదేశం పార్టీకి అగ్రిగోల్డ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. హాయ్ ల్యాండ్ ను సొంతం చేసుకోవాలి.. వీలైనంతా రాబట్టాలి.. అనే వ్యూహంతో కొన్ని వేల మంది అగ్రిగోల్డ్ బాధితుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు పెద్దలు. వ్యవహారంపై అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడు పవన్ కల్యాన్ ఎంట్రీ ఇచ్చాడు! మరి మూడేళ్ల నుంచి పవన్ కల్యాణ్ కు ఈ వ్యవహారంపై అవగాహన లేదా? అగ్రిగోల్డ్ బాధితులు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు? అంటే.. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ట్రయల్ పార్ట్ అనే అభిప్రాయం కలగకమానదు. అగ్రిగోల్డ్ వ్యవహారం తమకు వ్యతిరేక దిశను తీర్చుకుంటున్న నేపథ్యంలో.. అది ప్రతిపక్షానికి అనుకూలంగా మారకుండా.. మధ్యలో తన ట్రంప్ కార్డు పవన్ కల్యాణ్ ను ప్రయోగిస్తున్నట్టుగా ఉన్నాడు తెలుగుదేశం అధినేత.

జగన్ యువభేరీలు అంటే.. పవన్ కల్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ల కాలేజీ ఒకదాంట్లోకి వెళ్లి యూత్ తో మీటింగ్ అన్నాడు... హోదా గురించి జగన్ మీటింగులు అంటే.. హోదా గురించినే పవన్ కల్యాణ్ కూడా ఒక మీటింగ్ పెట్టాడు...అంత కన్నా ముందు రాజధాని రైతుల దగ్గరకు జగన్ వెళితే.. ఆ వెంటనే పవన్ కల్యాణ్ కూడా అక్కడికి వెళ్లి ఒక రోజు హల్ చల్ చేశాడు...ఇక తుందుర్ర ఆక్వా ఈ అంశాలన్నింటిపైనా జగన్ స్పందిచడం.. ప్రభుత్వం ఇరకాటంలో పడటం.. పవన్ కల్యాణ్ వచ్చి ఆ వ్యవహారాలను తన మాటలతో డైల్యూట్ చేయడం. ఇదీ స్క్రిప్ట్.. ఈ రీమేక్ స్క్రిప్ట్ నే జనసేన అధినేత ఫాలో అవుతున్నట్టున్నాడు.

Show comments