రెడ్డిగారూ.. మీకెందుకీ సవాళ్ళ టెన్షన్‌.?

ఔనా, జానారెడ్డి కూడా మాట్లాడేస్తారా.? అది కూడా టీఆర్‌ఎస్‌ని విమర్శించేస్తారా.? ఎంత మాట, ఎంత మాట.. కేసీఆర్‌ చెవిన పడిందా.. అంతే సంగతులు. తెలంగాణ రాజకీయాల్లో విన్పిస్తోన్న మాట ఇది. అందరికీ తెల్సిన విషయమే, తెలంగాణ రాష్ట్ర సమితికి అత్యంత సన్నిహితుడిగా వెలుగుతున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి. ఇదిప్పటి మాట కాదు, ఎప్పటినుంచో నడుస్తున్నదే. 

తెలంగాణ ఉద్యమంలోనూ జానారెడ్డి, కేసీఆర్‌తో కలిసి పనిచేశారు. జానారెడ్డి సూచనలతో కేసీఆర్‌, తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేశారు. అఫ్‌కోర్స్‌.. జానారెడ్డి సూచించిన కోదండరామ్‌ని కేసీఆర్‌ తెలంగాణ వచ్చాక 'డంప్‌' చేసేశారనుకోండి.. అది వేరే విషయం. తెలంగాణ వచ్చాక, జానారెడ్డి ప్రతిపక్ష నేత అయినప్పటికీ.. ప్రతిపక్ష నేతలా కాకుండా, టీఆర్‌ఎస్‌కి మిత్రపక్ష నేతగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. 

'నన్నే అంత మాట అంటారా.? నేను రాజీనామా చేసేస్తున్నా.. నా ప్లేస్‌లోకి ఎవరైనా వచ్చేయొచ్చు..' అని జానారెడ్డి ఎన్నిసార్లు ఘీంకరించలేదు గనుక.? ఆ ఘీంకారాలన్నీ జస్ట్‌ షో అంతే. ఇప్పుడీయనగారు, టీఆర్‌ఎస్‌కి సవాల్‌ విసిరేశారు కామెడీగా. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రెండో పంట ఇస్తే, తాను టీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం చేస్తానంటూ జానారెడ్డి సవాల్‌ విసిరేసరికి అంతా షాక్‌కి గురయ్యారు. 

ఇప్పుడు కొత్తగా టీఆర్‌ఎస్‌కి జానారెడ్డి ప్రచారం చేయడమేంటి.? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ తరఫున జానారెడ్డి ప్రచారం చేశారు. అంతెందుకు, తెలంగాణ వచ్చాక.. ప్రతిపక్ష నేత అయి వుండీ, జీహెచ్‌ఎంసీ భోజనాన్ని పొగిడేస్తూ టీఆర్‌ఎస్‌ తరఫన ప్రచారం చేశారు. ఇంతలా టీఆర్‌ఎస్‌కి మేలు చేసి, జానారెడ్డి ఇప్పుడు కొత్తగా హడావిడి చేస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? టీఆర్‌ఎస్‌ కోవర్ట్‌ అనే విమర్శల నుంచి జానారెడ్డి ఇలా తప్పించుకోవాలనుకుంటున్నారా.? ఏమో మరి ఆయనకే తెలియాలి.

Show comments