తాను చేయదలచుకున్నది మాత్రమే చేయడం.. తాను చేయదలచుకున్న కుట్రను జనం గుర్తించేస్తే గనుక.. ఏదో మాయతో దాన్ని కప్పిపుచ్చడం.. ఇలాంటివి నాయకులకు చాలా సాధారణంగా ఉండే టెక్నిక్కులు. అలాంటిది నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడుకు అవన్నీ తెలియవని అనుకోలేంద. అందుకే ఆయన పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పత్రికలో ఓ వార్త చూడగానే తెగ ఆశ్చర్యం కలిగింది.
చంద్రబాబు మరియు తెలుగుదేశం పార్టీకి చాలా రకాలుగా భవిష్యత్తు పోలవరం ప్రాజెక్టును 'స్వయంగా నిర్మింపజేయడం' అనే వ్యవహారంలో ఇమిడి ఉన్నప్పుడు.. జాతీయ ప్రాజెక్టుగా దాని మీద సకల హక్కులు కేంద్రానికే ఉన్నా సరే.. నిర్మాణ బాధ్యతను కేంద్రానికి అప్పగించడానికి చంద్రబాబు ఎలా ఒప్పుకున్నారా అని సందేహం కలిగింది. తీరా వార్తలోకి వెళ్లాక అసలు మర్మం ఉంది.
''అవసరమైతే'' అనే పదాన్ని వాడి.. 'అవసరమైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికి ఇచ్చేస్తాం. అయితే వారు 2018 లోగా పూర్తి చేయాలి'' అని చంద్రబాబు సెలవిచ్చారు. చేస్తార్లే ముందు తమరు వారికి ఇచ్చేయండి.. అని మళ్లీ ఎవరైనా నిలదీస్తే.. ఆ పూచీ కాంగ్రెస్ తీసుకుంటుందా? వారే సాధించాలి.. వారిదే బాధ్యత.. అంటూ మళ్లీ కొత్త పితలాటకం పెడతారు. పోలవరం తాము కడుతూ ఉంటే మాత్రమే రెండేళ్లలో పూర్తి చేస్తాం అనేది చంద్రబాబు ఉవాచ.
అయితే కేంద్రం దీనికి ఉదారంగా సహకరించాలనేది ముక్తాయింపు. వారి సహకారం దేబిరించడం దేనికి.. వారి ప్రాజెక్టును వారి మొహాన పారేసి.. త్వరగా పూర్తిచేయండి అని పోరాడవచ్చు కదా.. అలాంటి పని మాత్రం చంద్రబాబు చేయరు! వాళ్లయితే ప్రాజెక్టు కట్టలేరు కట్టరు అని భయం పుట్టించేలా.. తమ చేతిలో నిర్మాణం ఉంటేనే పనులు జరుగుతాయని, ప్రతివారం డ్రోన్లతో పర్యవేక్షిస్తా అని, రెండేళ్లలో పనులు పూర్తిచేస్తాం అని చంద్రబాబు చెబుతున్నారు.
పోలవరం తమ ఆధ్వర్యంలో రెండేళ్లలో పూర్తికాకపోతే ఏంటి? అనేది మాత్రం ఆయన చెప్పడంలేదు. అప్పుడు మళ్లీ కేంద్రం నిధులు సకాలంలో ఇచ్చి సహకరించలేదు అంటూ సాకులు చెప్పడం గ్యారంటీ.. అదేదో ఇప్పుడే కేంద్రానికి ప్రాజెక్టు బాధ్యత ఇచ్చేయవచ్చు కదా.. అమ్మమ్మా.. ఇవ్వరు గాక ఇవ్వరు. అందులో చాలా మతలబు, మర్మం దాగి ఉంది మరి!