జేసీ అన్నదమ్ములిద్దరూ... రిటైర్డ్‌ హర్ట్‌..?!

అన్నీ ఉండి అసహనంతో కాలిపోతున్నట్టుగా కనిపించే రాజకీయ నేతలు జేసీ సోదరులు. వీళ్ల మాటలకు హద్దుండదు, చేతలకు పొంతన ఉండదు.. బూతులు తిట్టడం, తిట్టించుకోవడం వరకూ వచ్చింది వ్యవహారం. మరి ఇంతటితో ఆగుతారా? లేక ఇంకా జారడం ఏమైనా ఉంటుందా? అనుకోవాల్సి వస్తోంది. వీళ్లు మాట్లాడుతున్న మాటలు వింటుంటే.. వీళ్ల గురించి రాసుకోవడానికి మీడియా కూడా సిగ్గు పడాల్సిన పరిస్థితి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలూ సహజమే.. అయితే నోరుంది కదా అని, దిగజారగలం కదా అని... ఎంతకంటే అంతకు దిగజారితే.. పట్టించుకునే వాళ్లు ఎవ్వరూ ఉండరు. అంటారు.. మాత్రమే కాదు, అనిపించుకుంటారు.. అనే ట్యాగ్‌ కూడా పడుతుంది.

జగన్‌పై మీదపడి రక్కేసేలా మాట్లాడిన ప్రభాకర్‌ రెడ్డిని జగన్‌ అభిమానులు తీవ్రంగానే దూషిస్తున్నారు. పచ్చిమాంసం తినే రాక్షసుడిగా అభివర్ణిస్తున్నారు... తాగుబోతు అంటున్నారు.. నీకు 'అమ్మ' లేదా? అని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ అయితే ప్రభాకర్‌ రెడ్డి గురించి స్పందించలేదు, మీడియా గుచ్చిగుచ్చి అడుగగా.. ''కుక్క..''గా అభివర్ణించి వదిలేశాడు ప్రతిపక్ష నేత. మరి సరిపోతుందా? లేక దివాకర్‌ రెడ్డి సోదరులు.. తాము ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో, అలాంటి మాటలనే అనిపించుకోవాలని కోరుకుంటున్నారో తెలియాల్సి ఉంది.

గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇలా అనుచితంగా మాట్లాడటం దివాకర్‌ రెడ్డి సోదరులకు కొత్తేమీకాదు, ఇది వరకూ వ్యక్తులను, ప్రముఖులను కులం పేరు పెట్టి దూషించిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని దూషణలు కేసుల వరకూ వెళ్లాయి. అయితే ఎక్కడా ఎవ్వరూ అడ్డుకునే వాళ్లు లేకపోవడంతో.. జేసీ బ్రదర్స్‌ హద్దుమీరారు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా.. తాము మాట్లాడిన బూతులను ఆఖరికి సొంతింట్లో వాళ్లే అసహ్యించుకునే పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్‌ రెడ్డి సైలెంట్‌ అయ్యాడు.

మరి ఈ సైలెన్స్‌లో ఆయన ఒక ప్రకటన కూడా చేశాడు. తను వచ్చే ఎన్నికల్లో పోటీచేయను అని తెలిపాడు. ఇదే ఆఖరి టర్మ్‌ అని అన్నాడు. తాడిపత్రి నుంచి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశాడు ప్రభాకర్‌ రెడ్డి. అంతకు ముందు దశాబ్దాల నుంచే ప్రత్యక్ష పోటీ పట్ల ఆయన ఉత్సాహం చూపించాడు. అయితే కాంగ్రెస్‌లో అవకాశం దక్కలేదు. అనంతపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని కాంగ్రెస్‌లో తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే అక్కడ నుంచి అనంత వెంకట్రామిరెడ్డి పోటీలో ఉండటంతో... ప్రభాకర్‌ రెడ్డికి అవకాశం రాలేదు. అలా అడ్డు ఉన్నాడని చెప్పి.. వెంకట్రామి రెడ్డిపై తరచూ విరుచుకుపడే వాళ్లు. ఇప్పుడు కూడా అనంత వెంకట్రామి రెడ్డి అంటే కస్సున విరుచుకుపడతారు వీళ్లు.

ఎట్టకేలకూ తెలుగుదేశం నుంచి అవకాశం వచ్చింది. పోటీలో దిగారు... మరి అంత ఆరాట పడిన ప్రభాకర్‌ రెడ్డి.. ఒకసారి పోటీతోనే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించడం విశేషం. ఇదంతా వారసుడి కోసమే అని ప్రత్యేకంగా చెప్పనక్కకర్లేదు. ప్రభాకర్‌ రెడ్డి తనయుడు అస్మిత్‌ రెడ్డి.. ప్రత్యక్ష రాజకీయాల  పట్ల ఉత్సాహవంతుడిలా కనిపిస్తున్నాడు.

ఇప్పటికే దివాకర్‌ రెడ్డి తనయుడు పవన్‌ రెడ్డి రంగంలోకి దిగి హల్‌చల్‌ చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా అతడు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని దివాకర్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించాడు. తద్వారా తనయుడికి లైన్‌ క్లియర్‌ చేశాడు. ప్రభాకర్‌ రెడ్డి కూడా రిటైర్డ్‌ హర్ట్‌ అనే విషయాన్ని ప్రకటించాడు. దీంతో అస్మిత్‌ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉండవచ్చు. ఈ విధంగా జేసీ సోదరుల ప్రత్యక్ష రాజకీయ పోరాటం ముగియబోతున్నట్టుగా ఉంది.  'జేసీ బ్రదర్స్‌'కు నిర్వచనం మారబోతోంది. దశాబ్దాలుగా అనంత, రాష్ట్ర రాజకీయాల్లో జేసీ బ్రదర్స్‌ అంటే.. దివాకర్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డిలు చలామణి అయ్యారు. ఇకపై మాత్రం ఆ స్థానంలో పవన్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలు చలామణి అయ్యే అకాశం ఉంది. మరి కొత్త వాళ్లతో అయినా.. ఈ బూతుల రాజకీయం మారుతుందని ఆశిద్దాం.

Show comments