ఆంధ్రలో డెల్, బెల్, ఆపిల్..ఇంకా?

ఆంధ్రలో ఆపిల్ ఇది నిన్నటి పత్రికల పతాక శీర్షిక. ఆంధ్రలో డెల్ ఇది ఇవాల్టి పత్రికల పతాక శీర్షిక. ఈ రెండింటికి భారీ అక్షరాల నడుమ చిన్న ఉప శీర్షికలు కూడా వున్నాయి. సంస్థల ఆసక్తి, బాబు ప్రతిపాదనకు సానుకూల స్పందన ఇలాంటివి. ఇదే అసలు శీర్షిక. కానీ మన జనాలకు ఆ శీర్షికలు, వాటి వెనుక వార్తలు చదివే ఓపిక వుండదు. ముందు భారీ అక్షరాలతో ఆంధ్రకు ఆపిల్, ఆంధ్రకు డెల్, బెల్ ఇవే. 

మీరు ఎవరి ఇంటికైనా వెళ్తారు. మీరు కూడా మా ఇంటికి రావాలి ఓసారి అని పిలుస్తారు. దానికి వాళ్లు మేం, రావండీ అనరు. తప్పకుండా, అలాగే, వీలు చూసుకుని అంటూ బదులిస్తారు. ఇదీ అలాంటిదే, సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా తమ దేశం వచ్చి, తమకు శాలువా కప్పి, తమ చేతిలో జ్ఞాపిక వుంచి, మీరు రాష్ట్రంలో బ్రాంచ్ ఓపెన్ చేయండి, మీకీ సదుపాయాలు కల్పిస్తాం అంటే, మొహం మీదే, అబ్బే కదురదు అనరు. తప్పుకుండా ఆలోచిస్తాం అంటారు.
ఇక్కడ ఇద్దరిదీ తప్పు కాదు. ఓ ముఖ్యమంత్రిగా అది చంద్రబాబు బాధ్యత. ఏదో విధంగా లయిజినింగ్ చేసి, ప్రముఖ కంపెనీలను ఆంధ్రకు తీసుకురావడం ఆయన కర్తవ్యం. అలాగే ఆపిల్, డెల్, బెల్ లాంటి కంపెనీలు వస్తే యూత్ లో చంధ్రబాబు బలపడే అవకాశం వుంటుంది. 

అయితే ఇక్కడ తప్పు ఎవరిదీ అంటే మన మీడియా అత్యత్సాహానికి. ఆపిల్ కు బాబు ఆహ్వానం, డెల్, బెల్ కు బాబు ప్రతిపాదన లాంటి హెడ్డింగ్ లు పెట్టాల్సిన వార్తకు, ఉప్పు కారం లేకుండా చప్పగా వుంటాయని, పైగా జనాల్లో బాబు ఇమేజ్ ను పెంచాలంటే ఇది మార్గం కాదని, రివర్స్ లో హెడ్డింగ్ లు పట్టి, ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం. 

భవిష్యత్ లో ఈ కంపెనీలు రావాలనే, వస్తాయనే ఆశిద్దాం. కానీ ఏదైనా కారణాల వల్ల రాకపోతే, అప్పుడు మీడియా తమ హెడ్డింగ్ లు సవరించుకుంటుందా? రాష్ట్రానికి ఆపిల్ మొండిచేయి. ఆంధ్రకు డెల్ బెల్ హుళక్కి? అనే టైపులో? అబ్బే చాలా కన్వీనియెంట్ గా మరిచిపోతారు. ఇలా మర్చిపోయినవి చాలానే వున్నాయి.

Show comments