బాహుబలి.. ఈ మేనియా ఏంటి.?

ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమాకీ జరగనంత హడావిడి బాహుబలి కోసం జరుగుతోంది. తప్పేం లేదు.. ఎందుకంటే, 'బాహుబలి' సినిమా టాలీవుడ్‌తోపాటు, కోలీవుడ్‌నీ, ఆ మాటకొస్తే బాలీవుడ్‌నీ ఓ ఊపు ఊపేసింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు సినీ అభిమానలంతా చర్చించుకుంటున్న అంశం 'బాహుబలి ది కంక్లూజన్‌' మాత్రమేననడం అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో 'బాహుబలి'ని 'పాపులర్‌' చేసేశాడు దర్శకుడు రాజమౌళి. 

'బాహుబలి ది బిగినింగ్‌' సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సినిమాని రాజమౌళి అండ్‌ టీమ్‌ మార్కెటింగ్‌ చేసిన తీరు అమోఘం. అంతకు మించిన మార్కెటింగ్‌ టెక్నిక్స్‌ని 'బాహుబలి ది కంక్లూజన్‌' కోసం ఉపయోగిస్తుండడంతో, ఈ సినిమాపై బీభత్సమైన క్రేజ్ నెలకొని వుంది. తెలుగు సినిమాకి ఇంతటి గౌరవాన్ని 'బాహుబలి' తీసుకొచ్చిందంటే అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు కదా. 

కాస్సేపట్లో 'బాహుబలి ది కంక్లూజన్‌' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరగనుంది. ఈ ఫంక్షన్‌ కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తయిపోయాయి. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి, ఈ మొత్తం వేడుకని చిత్రీకరించి, లైవ్‌లో ప్రసారం చేయనున్నారు. బిజినెస్‌ పరంగా 'బాహుబలి ది కంక్లూజన్‌' సరికొత్త రికార్డుల్ని సృష్టించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ట్రైలర్‌ యూ ట్యూబ్‌లో సంచలనాలు సృష్టించేస్తోంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా యూ ట్యూబ్‌ వ్యూస్‌ పరంగా సంచలనాలు సృష్టిస్తుందని 'బాహుబలి' టీమ్‌ అంచనా వేస్తోంది. మొత్తమ్మీద, 'బాహుబలి' మేనియా చూస్తే ఎవరైనాసరే, 'వావ్‌ ఈ మేనియా ఏంటి.?' అని ఆశ్చర్యపోకుండా వుండలేరు.

Show comments