వెంకయ్యపై ఆ రేంజిలో అయిష్టమా?

నిన్న శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా.. మద్దతు ఇచ్చారు. ఇవాళ మిత్రులుగా మారినప్పటికీ తిరస్కరించి వ్యతిరేకిస్తున్నారు. ఇది నిజంగా చిత్రమైన పరిణామం. రాష్ట్రపతి- ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారంలో బీహార్లో నితీశ్ సారథ్యంలో అధికారంలో ఉన్న జేడీయూ అనుసరిస్తున్న వైఖరి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. నిజాయితీకి మారుపేరుగా అందరూ చెప్పుకునే నితీశ్ కుమార్ కు వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం పట్ల ఆ రేంజిలో అయిష్టత పేరుకుపోయి ఉన్నదా అనే అనుమానం కూడా కలుగుతోంది. 

నితీశ్ కుమార్, ఆయన సారథ్యంలోని జేడీయూ నిన్నటిదాకా యూపీఏ కూటమిలో ఉన్నాయి. యూపీఏ తరఫున మహాకూటమి ఆధ్వర్యంలోనే బీహార్లో ప్రభుత్వం నడుస్తూ వచ్చింది. ఆ సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడు.. యూపీఏ అభ్యర్థిని కాదని... జేడీయూ తరఫున ఎన్డీయే అభ్యర్థి రాంనాధ్ కోవింద్ కు మద్దతు ఇచ్చారు. నిజానికి తమ పాలక కూటమిలోని ఆర్జేడీ యూపీఏ అబ్యర్థికి దన్నుగా నిలిచినప్పటికీ.. నితీశ్ మాత్రం.. తాను కోవింద్ కు మద్దతిచ్చారు. దీనివలన అప్పట్లోనే ఆయన ఎన్డీయేకు దగ్గరగా జరుగుతున్నట్లు ఎవ్వరూ అనుమానించలేదు గానీ.. నిన్నటి పరిణామాల్లో ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి.. తిరిగి భాజపా మద్దతుతో గద్దె ఎక్కిన తర్వాత కొందరు బురద చల్లారు. నితీశ్ అధికారం కోసం ఏమైనా చేస్తారని అన్నారు. రాహుల్ అయితే.. మూడు నాలుగు నెలల ముందు నుంచే నితీశ్ లో ఈ ఆలోచన ఉన్నట్లుగా రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ కు ఓటు వేయడం కూడా ఈ వ్యూహంలో భాగమే అన్నట్లుగా ఓ విమర్శ చేశారు. 

కానీ అదే ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చేసరికి నితీశ్ యూపీఏ అభ్యర్థి అయిన కాంగ్రెస్ వ్యక్తి గోపాలకృష్ణ గాంధీకి మద్దతివ్వడానికి పూనుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. వెంకయ్యనాయుడు మామూలుగా అందరినీ కలుపుకుపోయే మనిషి. శత్రుపక్షాలు కూడా వెంకయ్యనాయుడు విషయంలో ఉమ్మడి నిర్ణయాన్నే తీసుకుంటూ ఉండడం కద్దు. తెలుగు రాష్ట్రాల్లో పాలక విపక్షాలు రెండూ ఆయనకే జై కొడుతున్నాయి. తమిళనాడులోని పాలకపక్షంలోని చీలిక వర్గాలు రెండూ ఆయనకే మద్దతిస్తున్నాయి. ఇన్ని రకాలుగా ఆయన అందరి మద్దతును కూడగడుతున్న సమయంలో.. కొత్తగా తమ కూటమి ఎన్డీయే లోకి ప్రవేశించిన నితీశ్ మాత్రం హ్యాండ్ ఇవ్వడం ఆసక్తికరం. ప్రత్యేకించి వెంకయ్యనాయుడు మీద ఆయనకు ఆ రేంజిలో అయిష్టత ఉందా.. లేదా, మహాత్మ గాంధీ మనువడు అయిన గోపాలకృష్ణ గాంధీకి మద్దతివ్వడం అనేది తన నైతిక బాధ్యతగా భావించారా? అనే సంగతి స్పష్టత రావడం లేదు. నితీశ్ కేవలం గోపాలకృష్ణ గాంధీకి ఓటు వేయడంతో పరిమితం కాకుండా, ఆయన అభ్యర్థిత్వానికి ప్రచారం కూడా చేస్తే.. బహుశా మరి కొన్ని ఓట్లు అటు మారే అవకాశం కూడా ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. 

Show comments