లైట్‌ తీసుకున్నా.. హీట్‌ పెరుగుతోంది.!

రెడ్‌ హ్యాండెడ్‌గా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దొరికిపోయిన కేసు అది.. ఆ వ్యవహారానికి బ్రీఫింగ్‌ చేసింది స్వయానా పార్టీ అధినేత.. రాష్ట్రం వేరు అయినా, కేసు తీవ్రత ఎక్కువే.. హైకోర్టులో ఊరట లభించినట్లు, సుప్రీంకోర్టులోనూ అదే ఊరట లభిస్తుందన్న నమ్మకమేంటి.? 

- ఓటుకు నోటు కేసులో తాజా 'ట్విస్ట్‌' తర్వాత తెలుగుదేశం పార్టీలో దిగులు ఇది. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబే లైట్‌ తీసుకుంటున్నప్పుడు, మనకెందుకు ఈ టెన్షన్‌.? అని అనుకుంటున్నవారు టీడీపీలో చాలా తక్కువమందే కన్పిస్తున్నారు. తప్పదు మరి, ఆ మాత్రం టెన్షన్‌ వుండాల్సిందే. అధినేత అడ్డంగా బుక్కయిపోతే ఇంకేమన్నా వుందా.? తేడాలొచ్చేస్తాయ్‌.! బుక్కయిపోయేందుకు అవకాశాలెన్ని.? అన్న విషయమై పలువురు టీడీపీ ముఖ్య నేతలు న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా షురూ చేసేశారట. 

గతంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఈ ఓటుకు నోటు అంశం తెరపైకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ, ఆ అంశం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అన్నిటికీ మించి, పుత్రరత్నం ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేసిన రోజునే, అది కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకుంటున్న అమరావతి అసెంబ్లీలో సమావేశాలు ప్రారంభమవుతున్న తొలి రోజున ఈ పరిణామం, ఏమాత్రం తమకు శుభసూచకం కాదన్న వాదనలు టీడీపీ వర్గాల్లోనే విన్పిస్తున్నాయి. 'ఏముందిలే, ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకుంటే అంతా కామప్‌..' అన్న విమర్శలు విపక్షం నుంచి వెల్లువెత్తుతున్న వేళ, అధికార పార్టీ నేతల్లో ఆందోళన ఎంత దాచుకున్నా దాగడంలేదు. 

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే (ప్రస్తుతం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా) రేవంత్‌రెడ్డి ఏసీబీకి దొరకలేదనీ, మరో ఎమ్మెల్యే (ఈయనా తెలంగాణకు చెందినవారే) సండ్ర వెంకట వీరయ్యకు ఈ కేసుతో సంబంధం లేదనీ, అసలు తనకూ తెలంగాణ టీడీపీలో జరిగే పరిణామాలకీ సంబంధం లేదనీ.. అన్నిటికీ మించి, బయటకొచ్చిన ఆడియో టేప్‌లో వాయిస్‌ తనది కాదనీ.. ఇలా దేన్నీ చంద్రబాబు ఖండించలేదు. కానీ, 'ఆ కేసులో ఏమీలేదు..' అని బుకాయిస్తున్నారు. ఇదే, టీడీపీ నేతల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ తొలి సమావేశాల వేళ, చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకీ రాకూడని కష్టమే వచ్చింది కదూ.! 

Show comments