మామూలుగా ఐస్‌క్రీమ్ ధర ఎంతుంటుంది.? అర్థ రూపాయ నుంచి ఐదొందల దాకా. ఇంకా ఎక్కువంటే, వెయ్యి దాకా పలకొచ్చేమో. 'స్టార్ హోటల్స్'లో రేటు వెయ్యి దాకా వుంటే వుండొచ్చుగాక.! కానీ, ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కొత్తది. ఇంతవరకు ఎవరూ చూడనిది. ఇది టీఆర్‌ఎస్ ఐస్ క్రీమ్.. అవును, ఇది గులాబీ ఐస్ క్రీమ్. అమ్ముతున్నదెవరో తెలుసా.? తెలంగాణ మంత్రి కేటీఆర్. అద్గదీ అసలు విషయం. రేటు ఏ స్థాయిలో వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.!
ఎంత ఖరీదు అయినాసరే, ఓ పది వేలు వుండొచ్చుగాక.. అనుకుంటున్నారా.? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. కేటీఆర్ ఐస్ క్రీమ్ ధర జస్ట్ ఐదు లక్షలు మాత్రమే. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి (సారీ, ఈయనగారు టీఆర్‌ఎస్‌లోకి జంప్ చేశార్లెండి) ఐదు లక్షల రూపాయలకు ఐస్ క్రీమ్ కొనుగోలు చేశారు కేటీఆర్ నుంచి. మరో నేత, లక్ష రూపాయలకు ఐస్ క్రీమ్ కొనుగోలు చేయడం గమనార్హం. అదేంటీ, రేటు ఐదు లక్షల నుంచి లక్షకు పడిపోయింది.? అదంటే, ఇది పొలిటికల్ ఐస్ క్రీమ్.!
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు ...... అన్నట్టుంటుంది ఇలాంటి వ్యవహారాల్లోనే. ఇదంతా టీఆర్‌ఎస్ ప్లీనరీ కోసం నిధుల సేకరణ వ్యవహారం. పార్టీ మీటింగు కోసం చేస్తారా.? ప్రజల కోసమైతే చెయ్యరా.? రైతుల కోసం చెయ్యరా.? నిరుద్యోగుల కోసం చెయ్యరా.? అన్నదే కదా మీ డౌట్.! ఆ డౌట్ మీకు రాకూడదు, ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కోపమొస్తుంది. 'గులాబీ కూలీ' పేరుతో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, నేతలిలా 'కాస్ట్‌లీ అమ్మకందార్లు'గా మారిపోయారు.
తనయుడు కేటీఆర్ ఐస్ క్రీమ్‌కే ఇంత రేటు పలికితే, కేసీఆర్ చాయ్ అమ్ముతారో, ఇంకేదన్నా పని చేస్తారోగానీ.. ఆయనకు దక్కే 'కూలీ' ఒక్కసారి ఊహించుకోండి.! గుండె బద్ధలైపోతుంది జాగ్రత్త. వ్యాపారం అంటే ఇలా వుండాలి. ఇలాంటి వ్యాపారాలు చేతకాకనే, చిన్నా చితకా వ్యాపారులే కాదు.. బడా వ్యాపారులు కూడా అప్పులు పాలైపోయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి.!