నయీమ్‌ : ది సూపర్‌ డేర్‌ డెవిల్‌!!

నిన్న పోలీసు కాల్పుల్లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ గురించి ఇప్పటికే పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. నయీమ్‌ ఎన్ని హత్యలు చేసినదీ, ఎందరు పోలీసాఫీసర్లను చంపినదీ, ఎందరు రాజకీయ నాయకులకు ధమ్కీ ఇచ్చినదీ అన్నీ పుకార్ల రూపంలోనే వెలుగులోకి వచ్చాయి. అలాగే రాజకీయనాయకులు, పోలీసు అధికార్లు చాలా కీలక పదవుల్లోని వారు, కీలక స్థానాల్లోని వారు నయీమ్‌ తో కుమ్మక్కు అయి, హత్యలు- దందాలు చేయించేవారని కూడా పుకార్ల ద్వారా తెలుస్తున్నది. మంగళవారం నాటికి నయీమ్‌ కు సంబంధించిన పలు స్థావరాలు, ఇళ్ల మీదదాడులు చేసి ఆస్తులు, పత్రాలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. భార్య, అనుచరుల్ని కూడా అరెస్టు చేశారు. 

ఇవన్నీ.. నయీమ్‌ కు సంబంధించిన జరుగుతున్న పరిణామాలు. అందరికీ తెలిసినవే. అయితే నయీమ్‌ కు చెందిన నార్సింగిలోని ఒక ఇంటిపై దాడిచేసిన పోలీసులు కొన్ని కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు , కొన్ని తుపాకులు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నయీమ్‌ కు సంబంధించి ఎక్కడ ఎలాంటి దాడులు నిర్వహించినా తుపాకులు, కత్తులు ఆస్తులు దొరకుతున్నాయి. 

ఇక బిట్వీన్‌ దిలైన్స్‌లో.. ఈ విషయాల్ని కాస్త లోతుగా వెళ్లి పరిశీలించాల్సిన అవసరం ఉంది. హైదరాబాదు వంటి నగరంలో ఒక పెద్ద ముఠాను మెయింటైన్‌ చేస్తూ, హత్యలు, కిడ్నాపులు చేయిస్తూ ఉండే ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్‌కు వేల కోట్ల రూపాయల విలువైన భూములుండడం విశేషం కాకపోవచ్చు. అంత పెద్ద రౌడీకి ఆమాత్రం లేకపోతే ఎలా అని జనం అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నారు. 

భాగ్యనగరంలో దందాలు, హత్యలు చేయించే గ్యాంగ్‌స్టర్లు ఇంకా చాలా మందే ఉండొచ్చు. వారికి కూడా ఆస్తులు, డబ్బులు భారీగానే ఉండొచ్చు. కానీ సాధారణంగా తప్పుడు పనులుచేసేవారు, తమ సంపాదనను కాస్త రహస్యంగా దాచుకోవడం జరుగుతుంది. బినామీల ఇళ్లలో పెట్టడం, రహస్య లాకర్లలో పెట్టడం లాంటిది జరుగుతుంటుంది. కానీ నయీమ్‌ విషయంలో ఆయన నివసించే నార్సింగి ఇంటిలోనే కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములపత్రాలు పోలీసులకు దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. తుపాకులు, కోట్లరూపాయల డబ్బు అంతా తాను నిత్యం నివాసం ఉండే ''ఇంట్లోనే'' దొరికాయి. 

ఇక్కడే అసలు అనుమానం కలుగుతోంది. తన ఇంటిమీద ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారికంగా ఎప్పటికీ ఎలాంటి దాడి గానీ, తనిఖీలు గానీ జరుగుతాయనే భయం నయీమ్‌ కు లేదన్నమాట. ప్రభుత్వాలు సిగ్గు పడాల్సిన విషయం ఇది. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా.. ప్రభుత్వంలోనూ, పోలీసు వర్గాల్లోనూ, ఆ రకంగా తనిఖీలు చేయగల అధికారం ఉన్న సర్కారీ వర్గాల్లో నయీమ్‌ కు ఎంత లోపాయికారీ సంబంధాలు ఉన్నాయో ఇండైరక్టుగా తెలియజెప్పే దృష్టాంతం ఇది. 

తన ఇంటి గురించి ఎవరూ పట్టించుకుంటారనే భయం ఆయనకు లేదు. అందుకే అక్రమార్జనలు అన్నీ కూడా కూడా రైట్‌ రాయల్‌ గా ఇంట్లోనే ఉంచుకుని, డేర్‌ డెవిల్‌ అనిపించుకున్నాడు. వ్యవస్థలో ఉండే లోపం ఒక గ్యాంగ్‌ స్టర్‌ లో అలాంటి నిర్భయత్వాన్ని కలిగించింది. అతనికి ఈ సర్కారీ వ్యవస్థ అంతగొప్ప భరోసా ఇచ్చింది. 

అందుకే డేర్‌ డెవిల్‌ నయీమ్‌ 'నా దారి రహదారి' అంటూ తన వక్రమార్జనలు, దందాలు, హత్యాకాండలు సాగించడం గుర్తుకు వస్తున్నప్పుడు... తనకున్న 'అధికారిక' సంబంధాలు కూడా గుర్తుకు వచ్చి సమాజం సిగ్గుపడాల్సిందే. 

Show comments