కీరవాణి బాటలో తమన్

టాలీవుడ్ టు బాలీవుడ్ అంటే హీరోయిన్లే గుర్తొస్తారు. తెలుగులో క్లిక్ అయిన వెంటనే ఎప్పుడు బాలీవుడ్ చెక్కేద్దామా అని చూస్తారు. నెక్ట్స్ వరుసలో హీరోలు కూడా ఉన్నారు. కానీ మ్యూజిక్ డైరక్టర్లకు మాత్రం ఈ దారిలో కాస్త అవకాశాలు తక్కువే. కీరవాణి క్లిక్ అయినట్టు మరో కంపోజర్ బాలీవుడ్ లో మెరవలేదు. ఇప్పుడు తమన్ తన లక్ చెక్ చేసుకోబోతున్నాడు.

అజయ్ దేవగన్ హీరోగా నటించనున్న గోల్ మాల్-4 సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. రోహిత్ షెట్టి ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం ఈ డైరక్టర్ "గోల్ మాల్ ఎగైన్" అనే సినిమా చేస్తున్నాడు. ఈ అక్టోబర్ కు ఈ సినిమా విడుదల అవుతుంది. గోల్ మాల్-4 ఎప్పుడు సెట్స్ పైకి వచ్చేది ఇంకా క్లారిటీ లేదు. బట్, అది ఎప్పుడు పట్టాలపైకి వచ్చినా ఆ ప్రాజెక్టుకు తమనే సంగీత దర్శకుడు.

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కంపోజర్ గా పేరుతెచ్చుకున్నాడు తమన్. ఇచ్చిన ట్యూన్సే మళ్లీ ఇస్తాడని, ఎక్కడివో ఎత్తుకొచ్చి కొత్తగా అందిస్తాడనే విమర్శలు ఉన్నప్పటికీ... అత్యంత వేగంగా ట్యూన్స్ ఇస్తాడనే పాజిటివ్ రిమార్క్ కూడా ఉంది. అటు కోలీవుడ్ లో కూడా ఇతడికి హిట్స్ ఉన్నాయి. అలా సౌత్ లో బాగా పాపులర్ అయిన ఈ మ్యూజిక్ డైరక్టర్ ఇప్పుడు బాలీవుడ్ జనాలకు తన బీట్స్ వినిపించబోతున్నాడు.

Show comments