గౌతమ్ మీనన్… క్యాష్ చేసుకోగలడా?

మొత్తానికి వాయిదాలు పడటమే ఒకరకంగా మంచిది అయినట్టుగా ఉంది. “సాహసం శ్వాసగా సాగిపో’’ సినిమా రూపకర్త గౌతమ్ మీనన్ ఇప్పుడు బోలెడంత ఆనందంగా ఉండవచ్చు. నాగ చైతన్య ‘ప్రేమమ్’ రూపంలో హిట్ ను కొట్టడం అనేది గౌతమ్ మీనన్ కు అడ్వాన్స్ ఆనందం లాంటిదే. ఒకవేళ ‘ప్రేమమ్’’ కు ముందే గనుక “సాహసం శ్వాసగా..’’ విడుదల అయి ఉంటే.. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడిన ఆ సినిమా ఎవరినీ పెద్దగా ఆకర్షించగలిగేది కాదని వేరే చెప్పనక్కర్లా!

తను రూపొందించిన సినిమాను విడుదల చేయలేకపోతున్నాడు గౌతమ్ మీనన్. నెలలకు నెలలు గడిచిపోతున్నా.. చైతూతో అతడు తీసిన సినిమా విడుదల కావడం లేదు. ఒక దశలో ఈ సినిమాను ‘ప్రేమమ్’ విడుదల రోజునే విడుదల చేస్తామని గౌతమ్ మీనన్ ప్రకటించాడు. అయితే చైతూ దాన్ని నివారించాడు. ప్రస్తుతం ఇదే కాన్సెప్టును తన సొంత భాష మలయాళంలో రూపొందించే పనిలో ఉన్నాడట గౌతమ్.

ఇంతలోనే ‘ప్రేమమ్’ రావడం.. సూపర్ హిట్ అయిపోవడం.. జరిగింది. ఈ సినిమా చైతూకు మంచి జోష్ ఇచ్చింది. ఇది గౌతమ్ కు కూడా ప్లస్ పాయింట్ గా మారనుంది. ‘ప్రేమమ్’ తో హిట్ కొట్టిన చైతూ సినిమా గా “సాహసం శ్వాసగా..’’కు మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశాలున్నాయి. ఒకవేళ ప్రేమమ్ కు ముందే గనుక గౌతమ్ సినిమా విడుదల అయి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో చెప్పడానికి లేదు కానీ, కచ్చితంగా వీలైనంత త్వరగా ఆ సినిమా విడుదల అయితే ‘ప్రేమమ్’ విజయాన్ని అంతో ఇంతో క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. మరి గౌతమ్ ఆ పని అయినా చేయగలడో లేదో!

Show comments