చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లే సమాధానం ఇవ్వాలి..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిజస్వరూపాన్ని రోజురోజుకు బయటపెట్టుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. ఆయన మూమూలుగా ఎప్పటికప్పుడు మాట మార్చుతారన్నది అందరికి తెలిసిన విషయమే. అయినా ఇంత పచ్చిగా ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు ఇచ్చి తన మార్కు రాజకీయాన్ని ఆయన ప్రదర్శించారు. గతంలో ఆయన ఏమన్నారో ఒకసారి చూడండి.. ఒకపార్టీలో గెలిచి, మరో పార్టీలో మంత్రి అయితే తమ్ముళ్లూ మీరు ఒప్పుకుంటారా? రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇది గతంలో కేసీఆర్‌ ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ చేరినప్పుడు  తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు కూడా ఆయనకు దొరికి ఉండాలి. తెలుగు తమ్ముళ్లు కూడా ఒప్పుకున్నారని అనుకోవాలో, ఏమో కాని చంద్రబాబు కూడా స్వయంగా అదేపనికి పాల్పడ్డారు. 

రాజకీయాలలో తాను నిప్పు అని, తప్పు చేయనని, తనకు తానే గొప్పలు చేప్పుకునే చంద్రబాబు చేసిన నిర్వాకం ఇది. నైతిక విలువల గురించి తరచూ మాట్లాడే చంద్రబాబు నిత్యం అనైతిక చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఇలాంటి వాటి వల్లే వస్తాయి. తాను ఏమి చెప్పారో దానికి విరుద్దంగా ఆయన నలుగురు ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు కట్టబెట్టారు. దీనిని అంతా తీవ్రంగా విమర్శిస్తున్నా ఆయన పట్టించుకోలేదు. పైగా ఇది ఎన్నికల కేబినెట్‌ అని, అందుకే ఇలాచేశానని ఆయన అంటున్నారు. విశేషం ఏమిటంటే ఇతర వర్గాలకు చెందినవారు కూడా కొందరు ఫిరాయింపులు చేసినా అగ్రవర్ణాలకు చెందిన ఫిరాయింపుదారులకే మంత్రిపదవులు వచ్చాయి. అందులోను రెడ్డి సామాజికవర్గానికి ప్రాతినిథ్యం సరిగా లేదన్న విమర్శ నుంచి బయటపడడానికి ఆయన నలుగురు రెడ్డి నేతలకు మంత్రిపదవులు ఇచ్చారు. కాని అక్కడే ఒక పెద్దతప్పు చేశారు. 

టీడీపీని దశాబ్దాల తరబడి నమ్ముకుని ఉన్న రెడ్డి మంత్రులు బొజ్జల, పల్లెలను తొలగించి, వైసీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరిన రెడ్డి ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడం రెడ్లను గౌరవించినట్లా? అవమానించినట్లా అన్న చర్చ జరుగుతోంది. ఇక బొబ్బిలిలో కూడా రైతు, సామాన్య సామాజికవర్గానికి చెందిన మహిళను తప్పించి, రాజవంశీకులైన వెలమ వర్గానికి చెందిన బొబ్బిలి రాజాకు పదవి ఇచ్చారు. ఏపీలో కూడా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి ఒక్క మంత్రిపదవి ఇవ్వకపోవడం పెద్దలోటే అని చెప్పాలి. అలాగే ఎస్‌టీలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించినా, మంత్రిపదవి మాత్రం ఇవ్వలేకపోవడం చంద్రబాబు వైఫల్యంగా చెప్పాలి. అలాగే ఏపీలో క్షత్రియులకు మంత్రిపదవి లేకుండా ఏ మంత్రివర్గం లేదట. కాని ఈసారి మాత్రం క్షత్రియులు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. అలాగే గీత ఎన్నికలలో టీడీపీకి బ్రాహ్మణులు బలమైన మద్దతు ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. వారికి కూడా చంద్రబాబు మొండి చేయి చూపారు. మొత్తం పాతిక మందిలో పదిహేను మంది అగ్రవర్ణాలే కావడంతో ఇది అగ్రవర్ణాల కేబినెట్‌ అన్న విమర్శల ఎదుర్కోవలసి వస్తోంది. 

రాజకీయాలను అగ్రవర్ణాలే శాసిస్తాయన్న నమ్మకం కావచ్చు. మరొకటి కావచ్చు.ఇలా చేయడం సామాజిక సమతుల్యత కొరవడిందన్న భావన ఏర్పడింది. దీనిని చంద్రబాబు ఎన్నికల కేబినెట్‌ అంటున్నారు కాని, అప్పుడే టీడీపీలో వస్తున్న అపస్వరాలు, రాజీనామాల హెచ్చరికలు చూస్తే, టీడీపీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వస్తోంది. ఇవన్ని ఒక ఎత్తు అయితే గవర్నర్‌ నరసింహన్‌ ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు ఇవ్వడాన్ని వ్యతిరేకించకపోతే పోని, కనీసం నిరసన కూడా చెప్పకుండా చంద్రబాబుకు సరెండర్‌ అయిపోవడం ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసిందని చెప్పాలి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని చెప్పే గవర్నర్‌ ఆ పని చేయలేకపోయారు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలు నలుగురు మంత్రులై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించే రోజు వస్తుందా?

కొమ్మినేని శ్రీనివాసరావు

Show comments