నువ్వొస్తానంటే, మేమొద్దంటామా.!

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ అన్న పేరు సంపాదించుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. చాలామంది కొరియోగ్రాఫర్లు తెరపై డాన్స్‌ చేస్తోంటే, అందంగా అన్పించదు. కానీ, ప్రభుదేవా డాన్స్‌ చేస్తే అదిరిపోతుంది. డాన్స్‌ చేస్తే ఒక లెక్క, డాన్స్‌ చేయిస్తే ఒక లెక్క.. అందుకే అప్పటికీ, ఇప్పటికీ ఇండియాలోనే నెంబర్‌ వన్‌ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా మాత్రమే. 

అయితే, దర్శకుడయ్యాక కొరియోగ్రఫీని పూర్తిగా పక్కన పెట్టేశాడు ప్రభుదేవా. అప్పుడప్పుడూ తన సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నా, ఇదివరకటిలా ఇతర హీరోల సినిమాలకి కొరియోగ్రఫీ ఇవ్వకపోవడంతో, ప్రభుదేవా లేని లోటు చాలామంది హీరోలు, సినీ అభిమానులు ఫీలవుతున్నారు. 'బాలీవుడ్‌కి దర్శకుడిని, కోలీవుడ్‌కి నటుడ్ని, టాలీవుడ్‌కి మాత్రం కొరియోగ్రాఫర్‌ని..' అంటూ 'అభినేత్రి' సినిమా ప్రమోషన్‌ సందర్భంగా ఏదో ప్రాస కోసం డైలాగ్‌ పేల్చాడుగానీ, టాలీవుడ్‌కి ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా పనిచేసి ఎంత కాలమైందట.? 

నిజానికి, దర్శకుడిగా తెలుగులో తొలిసారి చేసిన ప్రయత్నం 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' పెద్ద సక్సెస్‌ అయినా, ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్‌లు దొరక్క, కోలీవుడ్‌కీ, ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్ళి, దర్శకుడిగా బాలీవుడ్‌లోనే సెటిలైపోయాడు. డైరెక్టర్‌ అంటే బోల్డంత టెన్షన్‌.. ఆ టెన్షన్‌లో కొరియోగ్రఫీ కష్టం.. అనే నిర్ణయానికి వచ్చేశాడు ప్రభుదేవా. అయినాసరే, తనలోని కొరియోగ్రాఫరే తనకు ఇష్టమంటాడు ప్రభుదేవా. అంత ఇష్టం వున్నప్పుడు కష్టంగా, కొరియోగ్రఫీని ఎందుకు వదులుకుంటున్నట్లు.? 

మళ్ళీ ఇంకోసారి ప్రభుదేవా, టాలీవుడ్‌ అంటే తనకు కొరియోగ్రఫీ గుర్తుకొస్తుందని చెప్పాడు గనుక, ప్రభుదేవా వస్తానంటే ఎవరైనా వద్దంటారా.? ఒక్కసారైనా ప్రభుదేవా కొరియోగ్రఫీలో పాట చెయ్యాలని కోరుకునే యంగ్‌ హీరోలు టాలీవుడ్‌లో చాలామందే వున్నారు. ప్రభుదేవాదే ఆలస్యం.

Show comments