సమయం లేదు మిత్రమా, సినిమాలొచ్చేస్తున్నాయ్

ప్రయత్నంగా అన్నారో, అప్రయత్నంగా అన్నారో..సమయం ఎంతో లేదు..సంక్రాంతికే..ఖబడ్డార్ అన్నారు గౌతమీ పుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్. సాధారణంగా సౌమ్యంగా వుండే క్రిష్ నే ఇలా ఆవేశపడ్డారు అంటే, ఇక సాదా సీదా అభిమానుల మాటేమిటి? ఇప్పుడు క్రిష్ ఎంత వివరణ ఇచ్చినా, జనంలోకి వెళ్లాల్సింది వెళ్లిపోయింది. ఇలా వెళ్లడానికి ముందుగానే, ఇటు నందమూరి అభిమానుల్లో, అటు మెగాస్టార్ అభిమానుల్లో తమ తమ హీరోల సినిమాల మీద విపరీతమైన ధీమా రానే వచ్చింది. దాని నేపథ్యంలో అపరమిత పోటీ కూడా రానే వచ్చింది. 

ప్రస్తుతం విడుదలకు ముందే పోరు హోరాహోరీగా సాగుతోంది. సోషల్ నెట్ వర్క్ ల్లో ఇప్పటికే ఎవరి అభిమానులు వారి వారి హీరోల సినిమా ప్రమోషన్ పనిపై బిజీ అయిపోయారు. పైగా ఆఫ్ ది రికార్డు గా అయినా, ఖైదీ 11న వస్తే, తాము 11నే వస్తామని శాతకర్ణి యూనిట్ నుంచి సమాచారం అందుతోంది. 

బాలయ్య ది 100వ సినిమా..చిరుది 150 వ సినిమా. ఒకటి చారిత్రాత్మకం..రెండవది ఫక్తు మాస్ మసాలా..సినిమా జోనర్లలోనే భీకరమైన తేడా వుంది. ఇక్కడ బాలయ్య సినిమాకు మార్కులు పడతాయి.

మార్కెట్ చూస్తే, బాలయ్య సినిమా కన్నా, చిరు సినిమా ఎక్కువ రేట్లకు విక్రయించారు. దాదాపు బాహబలి రేంజ్ రేట్లకు అమ్మారు. ఇక్కడ చిరు సినిమాకు మార్కులు పడతాయి.

ఖైదీ నెంబర్ 150 కి కర్త కర్మ క్రియ అన్నీ మెగాస్టార్ నే. ఆయన పాటలు, ఆయన డ్యాన్స్ లు, ఆయన ఫైట్లు..ఇవే సినిమాకు శ్రీరామ రక్ష. చాలా కాలం తరువాత చిరంజీవిని తెరపై చూడాలనుకునేవారు, అభిమానులకు పండగ. కానీ ఎప్పడో కానీ సినిమాకు వెళ్లని వారు మాత్రం ప్రత్యేకించి వెళ్లాలనుకునే చాన్స్ వుండదు.

కానీ శాతకర్ణి పరిస్థితి వేరు.  ఇది మన కథ, మన చరిత్ర అన్న విషయం స్లోగా ఇంజెక్ట్ అవుతోంది. ఎప్పుడైతే జనాలు ఈ పాయింట్ కు కనెక్ట్ అవుతారో? కచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలనే ఆసక్తి జనరేట్ అవుతుంది. అప్పుడు రేంజ్ చాలా మారే అవకాశం వుంటుంది. 

రెండు సినిమాలు విడుదలవుతున్న సీజన్ సంక్రాంతి. సాధారంణగా సంక్రాంతికి మాస్ మసాలా సినిమాలే బాగా ఆడతాయి అన్నది ఇండస్ట్రీ నమ్మకం. 2016లో నాగ్ సోగ్గాడే చిన్ని నాయనా ఇలాగే సైలెంట్ హిట్ గా నిలిచింది. పండగల్లో క్లాస్ ఆడియన్స్ కన్నా మాస్ ఆడియన్సే సినిమా థియేటర్ల దగ్గర ఎక్కువగా కనిపిస్తారు. అది ఖైదీకి ప్లస్. 

ఓవర్ సీస్ ఎలా వుంటుంది అన్నది మరో పాయింట్. చిరు అభిమానులుగా ఖైదీని ఆదరిస్తారా? లేక ఓవర్ సీస్ ప్రేక్షకుల టేస్ట్ రీత్యా శాతకర్ణికి ఓటేస్తారా? బాలయ్య సినిమా గా అయితే ఓవర్ సీస్ డిస్కషన్ రాదు.కానీ సబ్జెక్ట్, ప్లస్ డైరక్టర్ కలిసి ఈ సినిమాకు ఓవర్ సీస్ రేంజ్ తెచ్చాయి.

ఇలా అన్నింటా ఒకదానితో మరొకటి పెర్ ఫెక్ట్ గా పోటీ పడుతున్నాయి. అందులో సందేహం లేదు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ల సినిమా కు మహరాజ పోషకులు. అందులోనూ సందేహం లేదు. వీళ్లు కాక న్యూట్రల్ ఆడియన్స్ ను ఎవరు ఆకట్టుకోగలిగితే వారే విజేత. రెండూ విజయం సాధించే ఇండస్ట్రీకి మంచిదే. 

 

Show comments