రాష్ట్రంలో మంత్రి పదవికి మించి సీనియర్ నాయకులు ఆశించే స్థాయి గల కార్పొరేషన్ నామినేటెడ్ పదవులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ముందు వరుసలో ఉండేది.. తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలికి అధ్యక్ష పదవి ఒకటి. టీటీడీ ఛైర్మన్ గిరీకోసం ప్రభుత్వంలో హైలెవల్ పైరవీలు చేయగలిగిన ప్రతి ఒక్కరూ కన్నేస్తుంటారు. ప్రస్తుతం ఆ పదవిలో చదలవాడ కృష్ణమూర్తి ఉన్నారు. ఆయన పదవీ కాలం ప్రస్తుతం పూర్తి కాబోతోంది. త్వరలో కొత్త బోర్డు నియామకం జరగాల్సి ఉంది. అయితే ఈసారి ఛైర్మన్ గిరీని దక్కించుకోవడానికి చంద్రబాబు మీద పలువురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు ఒత్తిడి తెస్తున్నట్లుగా అమరావతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేబినెట్ పదవికంటె టీటీడీ ఛైర్మన్ గిరీ దక్కితే చాలునని అనుకునే వారు నాయకుల్లో చాలా మందే ఉంటారు. అలాంటి వారి మధ్య ఇప్పుడు పోటీ హైలెవల్లో నడుస్తోంది. ప్రధానంగా కేంద్ర మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఎంపీ మురళీ మోహన్, ఇదే కేటగిరీలోకి వచ్చే మరో మంత్రి రాయపాటి సాంబశివరావు, రాష్ట్ర మంత్రి పదవిని ఆశించి భంగపడిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఈ పదవిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారట.
వీరిలో నరసరావుపేట ఎంపీ రాయపాటికి కొన్ని దశాబ్దాలుగా టీటీడీ ఛైర్మన్ పదవి మీద ఆశ ఉంది. గతంలో తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఆయన పలుమార్లు దీనికోసం ప్రయత్నించి భంగపడ్డారు. తెదేపాలోకి ఫిరాయించాక.. ఎటూ కేంద్రమంత్రి పదవిని ఇప్పించమని అడిగేంత సీన్ లేదు గనుక.. టీటీడీ ఛైర్మన్ పోస్టుకోసం పెద్దస్థాయిలోనే ఒత్తిడి చేస్తున్నారట. ఒక్కసారైనా టీటీడీ ఛైర్మన్ గా చేయడం తన జీవితాశయం అని చెప్పుకుంటున్నారట. అలాగే సినీనటుడు మురళీమోహన్ కూడా గట్టిగానే పట్టుపడుతున్నారట. వీరితో ముద్దును కూడా కలుపుకుంటే వీరంతా కమ్మ వర్గానికి చెందిన వారే కావడం విశేషం. అయితే మరో ట్విస్టు ఏంటంటే.. ఇదే కులం నుంచి ఇంకా అనేక మంది కూడా చంద్రబాబు ను అడుగుతున్నారు గానీ.. ప్రధానంగా ఈ మూడు పేర్లే వినిపిస్తున్నాయి.
చంద్రబాబు ఎవరి పట్ల మొగ్గుతారో క్లారిటీ లేదు గానీ.. పార్టీ వర్గాల్లో మాత్రం వీరి ప్రయత్నాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మురళీమోహన్ పార్టీ కోసం పెద్దగా పాటు పడింది ఏమీ లేదని , అలాగే రాయపాటికి పదవి ఇస్తే.. సరిగ్గా ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి ఫిరాయించి వచ్చిన వారికి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారనే అపకీర్తిని మరింతగా మూటగట్టుకోవాల్సి వస్తుందని పలువురు అంటున్నారట. అంతో ఇంతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో దురదృష్టం వెక్కిరించిన గాలి ముద్దు కృష్ణమ నాయుడికే మొగ్గు ఉండవచ్చునని అంటున్నారు. స్థానికంగా చిత్తూరు జిల్లాకు చెందిన నేత కావడం, సీనియర్ గా పార్టీ ప్రతి పక్షంలో ఉన్న కాలంలో.. అధికార పక్షాల మీద విమర్శలు గుప్పించడంలో ఎడాపెడా దూకుడును ప్రదర్శిస్తూ పార్టీకి అండగా నిలవడం వంటివి గాలికి ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు. అలాగే.. వయసు మీద పడిన నేపథ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని , చంద్రబాబు గాలి కి పదవి కట్టబెట్టవచ్చునని అనుకుంటున్నారు.