విద్యాబాలన్‌.. ఇంకా ఊరిస్తూనే..!

తెలుగులో సినిమా చేసెదెప్పుడు.? అనడిగితే, 'అతి త్వరలో..' అని చాలాకాలంగా విద్యాబాలన్‌ చెబుతూనే వస్తోంది. ఆ మాటకొస్తే, పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు తెలుగు సినిమాల్లో నటించేందుకు తమకు ఆసక్తి వుందని చెబుతూనే వున్నారు. తీరా, సినిమాలో ఛాన్సిస్తామని ఏ దర్శక నిర్మాత అయినా ముందుకొస్తే చాలు, 'సారీ, డేట్స్‌ లేవు..' అని నిర్మొహమాటంగా తిప్పిపంపేస్తున్నారు. విద్యాబాలన్‌ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. 

'నాగార్జునతో కలిసి నటించాలని వుంది.. టాలీవుడ్‌ అంటే చాలా ఇష్టం.. హైద్రాబాద్‌ అన్నా, తెలుగు ప్రేక్షకులన్నా ఇంకా ఇంకా ఇష్టం..' అని విద్యాబాలన్‌ గతంలో ఓసారి హైద్రాబాద్‌ వచ్చినప్పుడు చెప్పింది. తాజాగా, మరోసారి హైద్రాబాద్‌ వచ్చిన విద్యాబాలన్‌ని, 'తెలుగులో నటిస్తానన్నారు కదా.?' అని ప్రశ్నిస్తే, 'ఇప్పుడూ అదే చెబుతున్నా.. సరైన ఛాన్స్‌ రావాలి కదా..' అంటూ తప్పించేసుకుంది. 

హైద్రాబాద్‌లో జరిగే తన సినిమా షూటింగుల కోసం ఇక్కడికి రావడం తప్ప, తెలుగు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్‌ విద్యాబాలన్‌లో కన్పించదు. ఏదో మొహమాటానికి అలా, తెలుగులో నటించాలని వుందంటూ ఓ మాట చెప్పి ఊరుకుంటుందంతే. అయితే, విద్యాబాలన్‌తో తెలుగులో నటింపజేయాలనే ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే వున్నాయి. చాలా సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తోన్న విద్యాబాలన్‌, తెలుగులో గనుక సినిమా చేస్తే.. ఆ కిక్‌ ఓ రేంజ్‌లో వుంటుంది. 

'డర్టీపిక్చర్‌' సినిమాలో సిల్క్‌స్మిత జీవిత కథ.. అంటూ పెద్ద ప్రచారమే జరిగింది. అదే ఆ సినిమాకి పెద్ద ప్లస్‌ అయ్యింది కూడా. అలా, మన తెలుగు సినిమాని (అఫ్‌కోర్స్‌ సిల్క్‌ స్మిత చాలా భాషల్లో సినిమాలు చేసినా, తెలుగులోనే బాగా పాపులర్‌ కదా..) వాడేసుకుని, ఆ సినిమా ప్రమోషన్‌ కోసం, ఆ తర్వాత చాలా సినిమాల ప్రమోషన్‌ కోసం తెలుగు సినిమాపై మమకారం ప్రదర్శించిన విద్యాబాలన్‌, ఎప్పటికన్నా మాట నిలబెట్టుకుని తెలుగు సినిమాల్లో నటిస్తుందా.? వేచి చూడాల్సిందే.

Show comments