లోకేష్.. ఈ విషయాన్ని బాబుకు చెప్పాల్సింది పాపం!

మరోసారి మాట మార్చారు.. ఎన్నిసార్లు అయినా మార్చే శక్తియుక్తులు ఉన్న వారు మరి! మ్యాటరేమిటనేది ముఖ్యం కాదు.. మాట మార్చడంలో ప్రతిభ మాత్రం ఇట్టే ప్రదర్శించేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీకి ‘ప్రత్యేకహోదా’ విషయంలో కూడా తెలుగుదేశం మాటమార్పుడు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో ఏమో “ఏపీకి ప్రత్యేకహోదా’’ అంశాన్ని ఎంత వీలైతే అంతగా హైలెట్ చేసింది తెలుగుదేశం- బీజేపీల కూటమి!

తాము అధికారంలోకి వస్తే ఏపీ ఐదు, పది, పదిహేనేళ్ల ప్రత్యేక హోదా అన్నారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు ఎన్నికల ప్రసంగాలే  దీనికి సాక్ష్యం. ఇక ఎన్నికల తర్వాత ఎప్పటికప్పుడు ప్రత్యేక హోదా అంశం గురించి వాయిస్ మార్చుకొంటూ పోతున్నారు తెలుగుదేశం, బీజేపీ నేతలు. ఈ విషయంలో వీరి వేషాలను చూస్తుంటే.. ఔరా అనుకోవాల్సి వస్తోంది!

ముఖ్యమంత్రి అయ్యాకా.. ప్రత్యేకహోదా అంశంలో కేంద్రం వైఖరిపై స్పందిస్తూ “ప్రత్యే క హోదాతో ఏమొస్తుందండీ..’ అంటూ బాబుగారు ప్రశ్నించారు! ఎన్నికల ముందు తాను చెప్పిన మాట కు రివర్స్ లో మాట్లాడారు బాబుగారు. అక్కడ కట్ చేస్తే.. ఇటీవల మళ్లీ ఈయన ప్రత్యేకహోదా అంశం గురించి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన లేదు అని అరుణ్ జైట్లీ స్పష్టం చేసినప్పుడు .. తన రక్తం మరిగిపోతోందని బాబుగారు చెప్పుకొచ్చారు!

మొదటేమో ప్రత్యేక హోదా తో అన్నీ వచ్చేస్తాయన్నారు..  ఎన్నికలయ్యాకా ప్రత్యేక హోదా సంజీవని కాదన్నారు, హోదాతో ఏమొస్తందన్నారు.. మళ్లీనేమో ప్రత్యేకహోదా ఇవ్వకపోడం కేంద్రం చేస్తున్న అన్యాయం అన్నారు.. రక్తం మరిగిపోతోందన్నారు.. ఇప్పుడు మళ్లీ చినబాబు రంగంలోకి దిగారు. అపరమేధావి.. తొమ్మిదో తరగతిలోనే తండ్రికి సలహాలిచ్చి లోకేష్ ఆంధ్ర ప్రజలకు ‘ప్రత్యేకహోదా తో ఏపీకి లాభం లేదు.. కనీసం ఐదు వేల ఉద్యోగాలు కూడా రావు’ అంటూ లెక్కగట్టి మరీ చెప్పారు! 

మరి లోకేష్ ఏ హోదాలో ఈ ప్రకటన చేసినా.. ఈ విషయాన్ని రక్తం మరిగించుకుంటున్న తన తండ్రిగారికి కూడా చెబితే బాగుంటుందేమో! ప్రత్యేక హోదా ప్రతిపాదన లేదంటున్న కేంద్రం వైఖరితో తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న తన తండ్రికి “ప్రత్యేకహోదాతో ఉపయోగం లేదు.. ప్యాకేజీ’’ తీసుకొందాం.. అని లోకేష్ సలహా ఇస్తే మేలేమో! అసలే బాబుగారు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు! హోదా తో ఏమొస్తందని ఒకసారి, హోదాతో అన్నీ మరోసారి.. రక్తం మరిగిపోతోందని ఇంకోసారి.. బాబుగారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మరి లోకేష్ బాబు ఇప్పుడు తండ్రి ‘హోదా’ తో వచ్చే నష్టాలేమిటో వివరిస్తే బాగుంటుంది. 

ఇక జనాలంటారా.. ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీల విషయంలో వీరికి క్లారిటీ ఉంది. హోదా వస్తే ధీర్ఘ కాలిక ప్రయోజనాలుంటాయి, ప్యాకేజీ తో పప్పు బెల్లాలే అనేది ప్రజలకు తెలియనిది ఏమీ కాదు. ఈ విషయంలో చర్చించుకుని.. మాట్లాడుకోవాల్సింది పెదబాబు, చినబాబులే! 

Show comments