'ఇండియా' డబుల్‌ ధమాకా.!

ఒకే రోజు రెండు చిరస్మరణీయ విజయాల్ని అందుకుంది ఇండియా. అందులో ఒకటి ఆటలో సాధించిన విజయం అయితే, ఇంకొకటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అత్యుత్తమ విజయం. ఒకటి భారతీయుల్లో ఉత్సాహం నింపింది. ఇంకొకటి, భారతావని సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకదానితో ఒకదాన్ని పోల్చడం సరికాదు. ఆటలో విజయాన్నీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన విజయాన్నీ ఒక్కటిగా చూడలేం. కానీ, ఒకే రోజు రెండు ఆనందాల్ని భారతీయులు చవిచూశారు. 

చారిత్రాత్మకమైన 500వ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌ జట్టుని గిరగిరా తిప్పేశారు టీమిండియా బౌలర్లు. బ్యాటింగ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఒకింత ఆందోళన కలిగించినా, బౌలర్లు మాత్రం సత్తా చాటారు. తద్వారా 130 టెస్ట్‌ విజయాన్ని టీమిండియా అందుకుంది. కెప్టెన్‌ కోహ్లీనీ, టీమిండియా సభ్యుల్ని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

ఇక, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన విజయానికొస్తే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన నేటి విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అనితర సాధ్యమైన విజయమిది. ఇప్పటిదాకా భారత్‌ చూడని విజయమిది. ఒకే రాకెట్‌, రెండు రాకెట్ల తరహాలో పనిచేసింది. రెండు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టింది ఇస్రో - పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ ద్వారా. పిఎస్‌ఎల్‌వి అంటే ఇస్రోకి అత్యంత నమ్మదగ్గదైన రాకెట్‌. ఇస్రో విజయాల ప్రస్థానంలో పీఎస్‌ఎల్‌వీ పాత్ర చాలా చాలా చాలా ఎక్కువ. 

ఉదయం 9.12 నిమిషాలకు పిఎస్‌ఎల్‌వి సి-35 రాకెట్‌, తనతోపాటు మొత్తం 8 ఉపగ్రహాల్ని నింగిలోకి మోసుకెళ్ళింది. భారత్‌కి చెందిన స్కాట్‌శాట్‌-1ని తొలుత కక్ష్యలోకి ప్రవేశపెట్టి, ఆ తర్వాత మిగిలిన 7 ఉపగ్రహాల్ని మరో కక్ష్యలో పిఎస్‌ఎల్‌వి సి-35 రాకెట్‌ వదిలిపెట్టింది. నిజానికి ఇస్రో ఒకేసారి పలు శాటిలైట్లను నింగిలోకి పంపడం కొత్తేమీ కాదు. అయితే, ఒకేసారి రెండు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టడం మాత్రం ఇదే తొలిసారి. 

భారత్‌కి చెందిన స్కాట్‌శాట్‌-1తోపాటు, అమెరికా, జర్మనీ, అల్జీరియా, కెనడా తదితర దేశాలకు చెందిన ఉపగ్రహాల్ని ఈ సందర్భంగా నింగిలోకి విజయవంతంగా పంపించగలిగామనీ, ఇది అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ సాధించిన సూపర్‌ విక్టరీ అనీ ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

Show comments