రాహుల్‌ 'ప్రధాని' కల కరిగిపోతుందా?

రాజకీయాల్లో ఏదో ఒక అంశం మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏ నాయకుడి జాతకం ఎలా ఉంటుందో  మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎవరి రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది? ఎవరి రాజకీయ జీవితం అంతమవబోతుంది?...ఇలాంటి అనేక విషయాలపై మీడియా నిపుణులు, రాజకీయ నాయకులు అంచనాలు కడుతూనే ఉంటారు. కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షుడు, సోనియా గాంధీ తనయుడు రాహుల్‌ గాంధీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? ఉండదా?...ఇదీ ఇప్పుడు సాగుతున్న చర్చ. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఏమిటి? ప్రధాని పీఠం ఎక్కడమే. కొడుకును ప్రధానిగా చూడాలని తల్లి ఎంతో ఆరాటపడుతోంది. 

తల్లే అంత ఆరాటపడుతున్నప్పుడు కాంగ్రెసు నాయకుల గురించి చెప్పేదేముంది? పార్టీలో వయసు మీరినవారంతా రాహుల్‌ని ప్రధానిగా చూసి కన్ను మూయాలని కోరుకుంటున్నారు. యువ, మధ్య వయసు నాయకులు ఆయన్ని ప్రధానిని చేసి తీరుతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, పార్టీని నడిపించలేడని విమర్శించిన హస్తం పార్టీ నాయకులు కొందరు తల్లి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారు. కాని ఆయనకు అంత 'సీన్‌' లేదని ఇద్దరు ప్రముఖ పాత్రికేయులు తేల్చిపారేశారు. వారు అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారు? అంచనాలు తప్పే అవకాశం ఉంటుంది కదా అని కొందరు ప్రశ్నించవచ్చు. 

నిజమే...మారే రాజకీయ పరిణామాలను బట్టి అనుకున్నది జరగకపోవచ్చు. కాని రాహుల్‌ ప్రధాని కాలేడని చెప్పిన ఇద్దరు జర్నలిస్టులూ తల పండిన మేధావులు. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నవారు. రాజకీయ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నవారు. వారిలో ఒకరు చరిత్రకారుడు, కాలమిస్టు రామచంద్ర గుహ. మరొకరు ది ఎకనమిక్‌ టైమ్స్‌కు, ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు అసోసియేట్‌ ఎడిటర్‌గా, బిజినెస్‌ స్టాండర్డ్‌కు ప్రధాన సంపాదకుడిగా పనిచేసిన తెలుగు వ్యక్తి సంజయ్‌ బారు. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉనప్పుడు ఆయనకు మీడియా సలహాదారుగా కూడా పనిచేశారు. 

భారత రాజకీయాలకు సంబంధించి పలు పుస్తకాలు రాసిన సంజయ్‌ బారు తాజాగా మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుపై '1991: హౌ పీవీ నరసింహారావు మేడ్‌ హిస్టరీ' అనే పుస్తకం రాశారు. దీనికంటే ముందు ఈమధ్యనే వినయ్‌ సీతాపతి రాసిన 'హాఫ్‌ లయన్‌' (తెలుగులో నరసింహుడు) విడుదలైన సంగతి తెలిసిందే.  తన తాజా పుస్తకానికానికి సంబంధించి సంజయ్‌ బారు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'నెహ్రూ-గాంధీ శకం అంతరించింది' అని చెప్పారు. రాజీవ్‌ గాంధీ మరణంతోనే దేశ రాజకీయాల్లో నెహ్రూ-గాంధీ శకం అంతరించిందని, ఆ వంశం నుంచి ప్రధాని కావడం చూడబోమని అన్నారు. 

1989 తరువాత ఆ వంశం నుంచి ఎవ్వరూ ప్రధాని కాలేదని, మన్మోహన్‌ సింగ్‌ కాంగ్రెసు పార్టీకి చెందిన వ్యక్తే తప్ప నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవాడు కాదన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నది యూపీఏ ప్రభుత్వానికే తప్ప కాంగ్రెసు ప్రభుత్వానికి కాదని చెప్పారు. ఈమధ్య రామచంద్ర గుహ కాంగ్రెసు, రాహుల్‌ గురించి ఘాటుగానే వ్యాఖ్యానించారు. 'రాహుల్‌ గాంధీ రాజకీయాల నుంచి రిటైరైపోయి, పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడటం మంచిది' అన్నారు. బీజేపీ ప్రాబల్యాన్ని ఎదుర్కొనే శక్తి కాంగ్రెసుకు లేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు మళ్లీ బలమైన శక్తిగా ముందుకొస్తుందని చాలామంది భావించారని, కాని బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందని గుహ చెప్పారు. 

1960, 70 దశకాల్లో కాంగ్రెసు దేశాన్ని ఎలా ఏకఛత్రాధిపత్యంగా ఏలిందో, బీజేపీ కూడా ఆ విధమైన ఆధిపత్యం వహిస్తుందన్నారు. కొంతకాలం క్రితం ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ భవిష్యత్తు ప్రధానిగా రాహుల్‌ను ఎక్కువమంది అంగీకరించలేదు. ఇక ఉరీ ఘటన తరువాత ప్రధాని మోదీ పాక్‌ పట్ల వ్యూహాత్మకంగా వ్యవహరించి దాన్ని అంతర్జాతీయంగా ఒంటరిని చేయడం, అదను చూసి చాకచక్యంగా సర్జికల్‌ దాడులు నిర్వహింపచేసి పాక్‌ను కంగు తినిపించడం...మొదలైన పరిణామాలతో ఆయన ఇమేజ్‌ అందనంత ఎత్తుకు ఎదిగింది. 

మోదీ వ్యూహాలు, ఎత్తుగడలు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యచకితులను చేశాయి. ప్రపంచ దేశాలు భారత్‌ను తప్పుపట్టని విధంగా ఆయన వ్యవహరించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ 'ప్రధాని' కల కరిగిపోయే పరిస్థితి రావొచ్చని (వచ్చే ఎన్నికల్లో) అనుకుంటున్నారు. యువరాజుకు మోదీ అంతటి వ్యూహ చతురత, ధైర్యం ఉన్నాయా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కనుక బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే రాహుల్‌ కల కరిగిపోయినట్లే భావించాలి. 

Show comments